వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తనను సస్పెండ్ చేయడంపై మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు స్పందించారు. వైసీపీని ఒక్క మాట అనని తనను ఎందుకు సస్పెండ్ చేశారని ప్రశ్నించారు. తనపై పార్టీకి ఎవరు ఫిర్యాదు చేశారని.. ఏమని ఫిర్యాదు చేశారని ప్రశ్నించారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తనను సస్పెండ్ చేయడంపై మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు స్పందించారు. నర్సాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీని ఒక్క మాట అనని తనను ఎందుకు సస్పెండ్ చేశారని ప్రశ్నించారు. తనపై పార్టీకి ఎవరు ఫిర్యాదు చేశారని.. ఏమని ఫిర్యాదు చేశారని ప్రశ్నించారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా పార్టీ నుంచి సస్పెండ్ చేయడం దారుణమని అన్నారు. తప్పు చేయకుండా వేటు వేయడం ఎంతవరకు సమంజసం అని వాపోయారు.
రోజూ పార్టీని విమర్శిస్తున్న రఘరామ కృష్ణరాజుపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఆయనను పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదని ప్రశ్నించారు. సీఎం జగన్ కన్నా ముందే రాజకీయాల్లో వచ్చానని అన్నారు. తన రాజకీయ ప్రస్తానంలో ఎక్కడా అవినీతి లేదన్నారు. ఎవరి ఒత్తిడితో తనను సస్పెండ్ చేశారో చెప్పాలన్నారు. తన సస్పెన్షన్‌కు కారణాలను సాయంత్రంలోగా చెప్పాలని కోరారు. సరైన కారణం లేకుండా సస్పెన్షన్ చేస్తే.. వైసీపీ క్రమశిక్షణా సంఘం తీరుపై చట్టపరంగా పోరాటం చేస్తానని వెల్లడించారు.
వైసీపీ అధినేత, సీఎం జగన్.. మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ బుధవారం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. క్రమశిక్షణ కమిటీ సిఫారసుతో సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక, రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014 ఎన్నికలకు ముందు వైఎస్సార్‌సీపీలో చేరిన సుబ్బారాయుడు నర్సాపురం నియోజకవర్గం నుంచి మరోసారి పోటీ చేసి ఓడిపోయారు. అనంతర రాజకీయ పరిణామాలతో తిరిగి టీడీపీలో చేరి.. కాపు కార్పొరేషన్ ఛైర్మన్ పదవి దక్కించుకున్నారు. అయితే 2019 ఎన్నికలకు ముందు మళ్లీ వైఎస్సార్‌సీపీలో చేరి.. ఆ పార్టీ నుంచి పోటీ చేసిన ముదునూరి ప్రసాదరాజుకు మద్దతు ఇచ్చారు. ఇటీవలే ప్రభుత్వం ఆయనకు గన్‌మెన్‌లను తొలగించింది.
ఈ నేపథ్యంలో ఇటీవల మీడియాతో మాట్లాడిన కొత్తపల్లి సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల బరిలో ఉంటానని స్పష్టం చేశారు. నర్సాపురం నుంచే పోటీ చేస్తానని.. ఏ పార్టీ తరపున పోటీ చేస్తానన్న విషయం మాత్రం చెప్పలేనని వెల్లడించారు. ఒకవేళ ఎవరూ టికెట్ ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగానైనా బరిలో ఉంటానని కొత్తపల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా తనకు మంచి పట్టు ఉందని .. అన్ని కులాల్లో తనకు పడే ఓట్లు ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్న సమయంలోనూ నర్సాపురం నుంచి సొంతంగా గెలిచానని కొత్తపల్లి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న వైసీపీ అధిష్టానం.. పార్టీ నుంచి ఆయనను సస్పెండ్ చేసింది.
