విజయవాడ: కృష్ణా జిల్లాలో టీడీపీకి చెందిన  కీలక నేత మాజీ మంత్రి దేవినేని ఉమ మహేశ్వరరావు పోగోట్టుకొన్న చోటే వెతుక్కొనేందుకు ప్రయత్నాలు  ప్రారంభించాడు. తనకు దూరమైన వారిని తిరిగి దగ్గరయ్యే ప్రయత్నాలను మొదలు పెట్టాడు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఓటమి ఆయనలో మార్పుకు కారణమైందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

కృష్ణా జిల్లాలో టీడీపీలో దేవినేని ఉమ మహేశ్వరరావు కీలక నేత. 2009 నుండి 2014 వరకు జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు ఆయన తీవ్రంగా కృషి చేశారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో దేవినేని ఉమ మహేశ్వరరావు తన వంతు ప్రయత్నాలు చేశారు.

జిల్లాలో ప్రతి రోజూ కనీసం 200 కి.మీ పాటు పర్యటించేవాడు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆయన ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొనేవాడు.చంద్రబాబుకు కూడ అత్యంత సన్నిహితుడుగా ఆయనకు పేరుంది.

2014లో ఏపీ రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో దేవినేని ఉమ మహేశ్వరరావుకు భారీ నీటిపారుదల శాఖ మంత్రి పదవి ఆయనకు దక్కింది.

మంత్రి పదవి వచ్చినప్పటికి హైద్రాబాద్ నుండే కాకుండా విజయవాడ నుండే కార్యక్రమాలను ప్రారంభించాడు. ఆ తర్వాత చంద్రబాబునాయుడు విజయవాడకు పాలనను మార్చుకొన్నాడు.

2009-2014 మధ్య కాలంలో గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని టీడీపీ నుండి వైసీపీలో చేరారు.నాని వైసీపీలో చేరడానికి మాజీ మంత్రి దేవినేని ఉమ కారణమని నాని సన్నిహితులు ఆరోపించారు. 

గత ఏడాదిలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలో  ఉన్న  సమయంలో తన అసెంబ్లీ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల విషయంలో మంత్రి దేవినేని ఉమ అడ్డుపడ్డాడనే వంశీ పరోక్షంగా విమర్శలు గుప్పించాడు.

2014 కు ముందు పార్టీలోకి మాజీ మంత్రి దేవినేని నెహ్రును తీసుకొచ్చేందుకు ఉమ ప్రయత్నాలు చేస్తున్నారని వంశీ విమర్శలు చేశారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో నెహ్రు టీడీపీలో చేరాడు. 2019 ఎన్నికల తర్వాత నెహ్రు తనయుడు అవినాష్ టీడీపీని వీడి వైసీపీలో చేరాడు. 

2009 నుండి 2014 వరకు జిల్లాలోని పార్టీ నేతలతో దేవినేని ఉమ అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగి ఉండేవాడు. 2014లో మంత్రి పదవి చేపట్టిన తర్వాత ఉమ  కొందరు పార్టీ నేతలకు మధ్య అంతరం పెరిగిందనే ప్రచారం కూడ ఉంది.

2019 ఎన్నికల నాటికి ఈ అంతరం మరింత పెరిగింది. 2019  ఎన్నికల్లో దేవినేని ఉమ ఓటమిపాలయ్యాడు. దీంతో ఉమ తనకు దూరమైన వారికి తిరిగి  దగ్గరయ్యేందుకు ప్రయత్నాలను ప్రారంభించారు.

మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్ విషయంలో దేవినేని ఉమ తీవ్రంగా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను నిరసిస్తూ తన నియోజకవర్గంతో పాటు జిల్లాలోని పలు చోట్ల నిర్వహించిన ఆందోళన కార్యక్రమాల్లో చరుకుగా పాల్గొంటున్నాడు.  

అందరిని కలుపుకొంటూ వైసీపీ  ప్రభుత్వం తీసుకొంటున్న కార్యక్రమాలపై దూకుడుగా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.మంత్రిగా ఉన్న సమయంలో పార్టీ నేతలతో గ్యాప్ లేకుండా చూసుకొంటే పరిస్థితి మరోలా ఉండేదనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.