అమరావతి: ప్రజా వేదికను కూల్చేసి పైశాచిక ఆనందాన్ని  పొందుతున్నారని మాజీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ మహేశ్వరరావు అభిప్రాయపడ్డారు. త్యాగాలకు తాము సిద్దంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.

బుధవారం నాడు ఉండవల్లిలో చంద్రబాబు నివాసం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు.  ఉడత ఊపులకు,  పోలీస్ కేసులను తాము భయపడబోమని  ఆయన చెప్పారు.  ప్రజల కోసం త్యాగాలు చేయడానికే కాదు... ప్రాణాలు ఇచ్చేందుకు కూడ తాము వెనుకాడబోమన్నారు.

రాజధాని నిర్మించలేదని జగన్ ఆరోపణలు చేశాడు...  ఎక్కడ కూర్చోని జగన్ పాలన సాగిస్తున్నాడో చెప్పాలని దేవినేని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.  బస్సులో నివాసం ఉండి చంద్రబాబునాయుడు అమరావతి నుండి పాలన సాగించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

నిర్మాణాత్మక ప్రతిపక్షంగా తాము పనిచేస్తామని  ఉమ చెప్పారు.  టైమ్... బలీయమైంది, టైమ్  శక్తివంతమైంది... టైమ్ క్రూరమైంది..... అన్నింటిని ఎదుర్కొనేందుకు తాము సిద్దంగా ఉన్నామని ఆయన చెప్పారు.

పలు కేసుల్లో ఏ  2 నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డితో నీతులు చెప్పించుకోవాల్సి వస్తోందని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాలం కలిసొచ్చి  విజయసాయిరెడ్డికి కేబినెట్ హోదా దక్కిందన్నారు. 

పోలవరంలో అవినీతి జరిగిందని రోడ్లపై చెప్పిన జగన్...  అవినీతిని నిరూపించాలని  అధికారులు, ఐఎఎస్ అధికారులను ఎందుకు బతిమిలాడుడుతున్నారని ఆయన ప్రశ్నించారు.