రాజకీయాల నుంచి వైదొలుగుతున్నాం.. మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు సంచలన ప్రకటన..
మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాజకీయాలకు వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. నేటి రాజకీయాలలో తాను గానీ, తన అబ్బాయి కానీ ఇమడలేమని అన్నారు.

మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాజకీయాలకు వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. నేటి రాజకీయాలలో తాను గానీ, తన అబ్బాయి కానీ ఇమడలేమని అన్నారు. అందుకే తానూ, తన కుమారుడు హితేష్ రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలగుతున్నట్టుగా వెల్లడించారు. బాపట్ల జిల్లా ఇంకొల్లులో నిర్వహిస్తున్న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు శనివారం దగ్గుబాటి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్టీఆర్ మహోన్నత వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అని అన్నారు. తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని చెప్పారు.
తాను ఎన్నో కార్యక్రమాలు చేయడానికి భగవంతుడు అవకాశం కల్పించాడని దగ్గుబాటి వెంకటేశ్వరరావు అన్నారు. దానికి తృప్తి చెందుతూ ఎక్కడ ఫుల్‌స్టాప్ పెట్టాలనేది నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఇంకొల్లుతో తనకు ఎంతో అనుబంధం ఉందని.. అందుకనే తన మనసులోని మాటను ఇక్కడ బయటపెడుతున్నట్టుగా తెలిపారు.
‘‘లాస్ట్ టైమ్ అబ్బాయి కోసం ఒక ప్రయత్నం చేయడం జరిగింది కానీ దేవుడు వద్దని చెప్పాడు అని భావిస్తాను, చేసిన పనులకు తృప్తిగా ప్రజాజీవితానికి ముగింపు పలకాలని నిర్ణయం తీసుకున్నాం’’ అని ఆయన వెల్లడించారు. డబ్బుతో రాజకీయం, కక్ష సాధింపులకు దిగటం తమ కుటుంబానికి అలవాటు లేదని అన్నారు. గతంలో రాజకీయాలకు, నేటికీ పొంతన లేదని.. అందుకే హితేష్, తానూ రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలగుతున్నామని చెప్పారు.
ఇక, ఎన్టీఆర్ అల్లుడు అయిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు.. తెలుగు దేశం పార్టీని స్థాపించిన తర్వాత ఆ పార్టీలో చేరారు. 1983లో ఆయన పర్చూర్ నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత కూడా పలుమార్లు పర్చూరు నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎన్టీఆర్ క్యాబినెట్‌లో మంత్రిగా కూడా పనిచేశారు. 1991లో బాపట్ల నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత రాజ్యసభ సభ్యునిగా కూడా ఉన్నారు. అయితే 1995లో ఆంద్రప్రదేశ్‌లో టీడీపీ తిరిగి అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల తర్వాత.. ఎన్టీఆర్‌పై తిరుగుబాటులో వెంకటేశ్వరరావు చంద్రబాబు నాయుడు పక్షాన నిలిచారు. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆయన చంద్రబాబు నుంచి దూరం జరిగారు.
1999లో ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణ స్థాపించిన అన్నా టీడీపీలో కీలక భూమిక పోషించారు. అయితే ఆ ప్రయత్నం పెద్దగా ఫలించలేదు. ఆ తర్వాత దగ్గుబాటి వెంకటేశ్వరరావు తన భార్య పురంధేశ్వరితో కలిసి కాంగ్రెస్‌లో చేరారు. 2004లో జరిగిన స్వారత్రిక ఎన్నికల్లో పురంధేశ్వరి బాపట్ల నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పర్చూరులో దగ్గుబాటి వెంకటేశ్వరరావు విజయం సాధించారు. 2009లో కూడా ఆయన అక్కడి నుంచే అసెంబ్లీకి ఎన్నికయ్యారు. యూపీఏ హయాంలో పురంధేశ్వరి కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు.
అయితే ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలతో 2014లో పురంధేశ్వరి బీజేపీలో చేరారు. ఆమె ప్రస్తుతం అదే పార్టీలో కొనసాగుతున్నారు. అయితే 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ను కలిసి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన తనయుడు హితేష్ ఆ పార్టీలో చేరారు. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో తన కొడుకును బరిలో దింపాలని దగ్గుబాటి వెంకటేశ్వరావు భావించారు. అయితే కొన్ని కారణాలతో హితేష్‌కు బదులు దగ్గుబాటి వెంకటేశ్వరరావు బరిలో నిలిచారు. అయితే ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత కొద్ది రోజులకే దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీకి దూరం జరిగారు.
అయితే ఇటీవల చంద్రబాబుతో వెంకటేశ్వరరావుల మధ్య దూరం తగ్గినట్టుగా కనిపించడంతో.. వచ్చే ఎన్నికల్లో దగ్గుబాటి వెంకటేశ్వరరావు టీడీపీ నుంచి తన కొడుకు హితేష్‌ను బరిలో నిలిపే అవకాశాలు ఉన్నట్టుగా వార్తలు కూడా వచ్చాయి. అయితే అనుహ్యంగా తాను, తన కుమారుడు రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్టుగా ఆయన ప్రకటించారు.