అమరావతి: ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే బాధ్యతను ఇంటలిజెన్స్ ఐజీకి చంద్రబాబునాయుడు కట్టబెట్టారని మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆరోపించారు. తానే సీఎంగా ఉండి ఉంటే రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో ఒక్క క్షణం కూడ సీఎంగా కొనసాగకపోయేవాడినని చెప్పారు.

మంగళవారం నాడు  ఆయన  అమరావతిలో మీడియాతో మాట్లాడారు. అన్ని వ్యవస్థలను చంద్రబాబునాయుడు నిర్వీర్యం  చేశారని ఆయన విమర్శించారు. పార్టీలో అసంతృప్త నేతలు, ఎమ్మెల్యేలకు కాంట్రాక్టులు కట్టబెడతామని ఇంటలిజెన్స్ ఐటీ ప్రలోభాలకు గురి చేస్తున్నారని దగ్గుబాటి ఆరోపించారు.

కోట్లు ఖర్చు పెట్టి దీక్షలు చేయడం సరైందేనా అని ఆయన ప్రశ్నించారు. గతంలో పోలవరం ప్రాజెక్టును చంద్రబాబునాయుడు వ్యతిరేకించారని ఆయన గుర్తు చేశారు. అయితే ఇవాళ ఈ ప్రాజెక్టును తానే కడుతున్నానని ప్రచారం చేసుకొంటున్నారని దగ్గుబాటి చెప్పారు. రాజధాని నిర్మాణాన్ని గ్రాఫిక్స్‌లో చూపిస్తున్నారన్నారు.

రామాయపట్నం పోర్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నుండి కనీస సహకారం కూడ లేదని దగ్గుబాటి ఆరోపించారు. పార్లమెంట్‌లో ఎన్టీఆర్ విగ్రహం పెట్టే అవకాశం ఉన్నా కూడ ఆ అంశాన్ని చంద్రబాబునాయుడు పట్టించుకోలేదని ఆయన చెప్పారు.  అయితే ఈ విషయమై పురంధేశ్వరీ అప్పటి స్పీకర్‌ మీరాకుమార్‌ను కోరడంతో ఎన్టీఆర్ విగ్ర:హం పార్లమెంట్‌లో ఏర్పాటు చేసే అవకాశం లభించిందన్నారు. చంద్రబాబును చూస్తే జాలేస్తోందని ఆయన చెప్పారు.