సీఎంపై అనుచిత వ్యాఖ్యలు: టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి అరెస్ట్ (వీడియో)
మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవాళ ఉదయం నుండి బండారు సత్యనారాయణ ఇంటి ముందు ఉద్రిక్తత నెలకొంది.
విశాఖపట్టణం: మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిని సోమవారంనాడు రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో బండారు సత్యనారాయణమూర్తిని అరెస్ట్ చేశారు.
బండారు సత్యనారాయణమూర్తిపై రెండు కేసులు నమోదు చేశారు.ఏపీ మంత్రి రోజాపై, ఏపీ సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. ఈ కేసుల విషయమై నోటీసులు ఇచ్చేందుకు ఇవాళ ఉదయం నుండి బండారు సత్యనారాయణమూర్తి ఇంటి వద్ద పోలీసులు ప్రయత్నించారు. అయితే టీడీపీ కార్యకర్తలు పోలీసులను బండారు సత్యనారాయణమూర్తి ఇంట్లోకి రాకుండా అడ్డుకున్నారు. ఇవాళ రాత్రి బండారు సత్యనారాయణమూర్తి ఇంట్లోకి పోలీసులు వెళ్లారు. నోటీసులు తీసుకోకుండా తలుపులు వేసుకొని బండారు సత్యనారాయణమూర్తి నిరసనకు దిగారు. తలుపులు బద్దలు కొట్టి మాజీ మంత్రికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం జగన్ ను దూషించిన కేసులో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిని అరెస్ట్ చేసి గుంటూరుకు తరలిస్తున్నారు పోలీసులు.
బండారు సత్యనారాయణమూర్తి ఇంటి వద్ద ఇవాళ ఉదయం నుండి హైడ్రామా కొనసాగుతుంది. పోలీసులను టీడీపీ శ్రేణులు సాయంత్రం వరకు నిలువరించారు. టీడీపీ శ్రేణులను చెదరగొట్టి పోలీసులు బండారు సత్యనారాయణ మూర్తి ఇంట్లోకి వెళ్లారు. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో సీఎం జగన్ పై మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అనుచిత వ్యాఖ్యలు చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే పోలీసుల కేసులపై బండారు సత్యనారాయణమూర్తి తరపు న్యాయవాదులు కోర్టును ఆశ్రయించారు.
ఇదిలా ఉంటే బండారు సత్యనారాయణమూర్తి ఇంటికి పోలీసులు వచ్చిన విషయం తెలుసుకొని ఇవాళ ఉదయం మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అక్కడికి చేరుకన్నారు. బండారు సత్యనారాయణ మూర్తికి సంఘీభావం ప్రకటించారు. మరో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కూడ బండారు సత్యనారాయణ మూర్తి ఇంటికి వచ్చారు. బండారు సత్యనారాయణమూర్తి అరెస్ట్ ను ఆయన తీవ్రంగా ఖండించారు. రేపు ఉదయానికి బండారు సత్యనారాయణమూర్తి ఇంటికి తిరిగి వస్తారని అయ్యన్నపాత్రుడు ధీమాను వ్యక్తం చేశారు.