ఆంధ్రప్రదేశ్ ఫోరెన్సిక్ ల్యాబ్ మాజీ డైరెక్టర్ శివ కుమార్ విజయవాడలోని ఓ హోటల్‌లో అనుమానస్పద స్థితిలో మృతిచెందారు.

ఆంధ్రప్రదేశ్ ఫోరెన్సిక్ ల్యాబ్ మాజీ డైరెక్టర్ శివ కుమార్ విజయవాడలోని ఓ హోటల్‌లో అనుమానస్పద స్థితిలో మృతిచెందారు. వివరాలు.. శివకుమార్ హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో నివాసం ఉంటున్నారు. ఆయన గతంలో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో డైరెక్టర్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. అయితే ఆయన సర్వీసులో ఉన్నప్పటి ఓ కేసుకు సంబంధించిన వాంగ్మూలం ఇవ్వడానికి గురువారం విజయవాడకు వచ్చారు. డీవీ హోటల్‌లో ఆయన బస చేశారు. అయితే ఆయన హోటల్ గది నుంచి బయటకు రాకపోవడంతో.. సిబ్బంది ఫోన్ చేశారు. అయినప్పటికీ ఎలాంటి స్పందన లేకపోవడంతో.. సిబ్బంది రెండో తాళంతో గది తలుపు తెరిచి శివకుమార్ విగత జీవిగా పడి కనిపించారు. 

దీంతో హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడి చేరుకున్న పోలీసులు ఘటన స్థలంలో వివరాలు సేకరించారు. ఈ ఘటనపై అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శివకుమార్‌కు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని ఆయన బంధువులు చెబుతున్నారు.