Asianet News TeluguAsianet News Telugu

ఏపీ రాజకీయాల్లో సంచలనం .. కొత్త పార్టీ పెట్టిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ , పేరు ఇదే

వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఏపీలో మరో రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీని ప్రకటించారు. ‘‘జై భారత్ నేషనల్ పార్టీ’’ పేరుతో ఆయన ఎన్నికల బరిలో దిగనున్నారు. ఈ మేరకు పార్టీ జెండాను జేడీ లక్ష్మీనారాయణ ఆవిష్కరించారు. 

former cbi jd lakshminarayana announced a new party named jai bharat national party ksp
Author
First Published Dec 22, 2023, 8:24 PM IST

తెలంగాణ ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు తెలుగు ప్రజల దృష్టి ఏపీ ఎన్నికలపై పడింది. వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం వుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అధికార , ప్రతిపక్షాలు యాక్టీవ్ అయ్యాయి. సీఎం జగన్ ముందుగా ఆట ప్రారంభించినట్లుగా జరుగుతున్న పరిణామాలను బట్టి అర్ధం చేసుకోవచ్చు. తీవ్రమైన ప్రజా వ్యతిరేకతతో పాటు టికెట్లు  ఇచ్చినా గెలవరని తేలిన సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఆయన పక్కనబెట్టేస్తున్నారు. అత్యంత సన్నిహితులు, బంధువులు ఈ లిస్టులో వున్నప్పటికీ.. అధికారం అందుకునే విషయంలో రాజీ పడేందుకు జగన్ ఇష్టపడటం లేదు. ఎన్నికలకు రెండు నెలల ముందుగానే అభ్యర్ధులను ప్రకటించి వారిని జనంలో వుంచాలని జగన్మోహన్ రెడ్డి స్కెచ్ గీస్తున్నారు.

అటు విపక్షం విషయానికి వస్తే.. టీడీపీ, జనసేన పొత్తు కన్ఫర్మ్ అయిపోయింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్‌ను గద్దె నింపి అధికారాన్ని అందుకోవాలని ఈ రెండు పార్టీలు కృతనిశ్చయంతో వున్నాయి. పొత్తు, సీట్లు పంపకం, ఉమ్మడి కార్యాచరణ విషయంలో క్లారిటీ ఇచ్చేందుకు చంద్రబాబు, పవన్‌లు కసరత్తు చేస్తున్నారు. పరిస్ధితిని బట్టి చివరి నిమిషంలో ఈ కూటమితో బీజేపీ కలవొచ్చు, లేదా ఒంటరిగా పోటీ చేయొచ్చు. కమ్యూనిస్టులు సైతం టీడీపీ జనసేన కూటమిలోనే వుండే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ కనుక ఇందులో చేరితే అప్పుడు కామ్రేడ్లు బయటకొచ్చేస్తారనుకోండి అది వేరే విషయం.

అయితే వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఏపీలో మరో రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీని ప్రకటించారు. ‘‘జై భారత్ నేషనల్ పార్టీ’’ పేరుతో ఆయన ఎన్నికల బరిలో దిగనున్నారు. ఈ మేరకు పార్టీ జెండాను జేడీ లక్ష్మీనారాయణ ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ..  సమస్యలు పరిష్కారం కావాలంటే రాజ్యాధికారం కావాలని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చెప్పారని గుర్తుచేశారు. వివిధ వర్గాల ఆకాంక్షలు నెరవేర్చాలనే ఉద్దేశ్యంతో పార్టీని పెడుతున్నామని, మా పార్టీ ప్రజల్లో నుంచి పుట్టిన పార్టీ అని జేడీ లక్ష్మీనారాయణ అభివర్ణించారు. రాష్ట్రంలో నిరుద్యోగం ప్రధాన సమస్యఅని.. ప్రత్యేక హోదా గురించి ఎవ్వరూ మాట్లాడటం లేదన్నారు. ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజ్ ముద్దు అని కొందరు.. మెడల్ వంచి ప్రత్యేక హదా తెస్తామని మరికొందరు అన్నారని జగన్, చంద్రబాబులపై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. కానీ మెడలు వంగలేదు .. ప్రత్యేక హోదా రాలేదని లక్ష్మీనారాయణ ఎద్దేవా చేశారు. 

ప్రత్యేక హోదా తీసుకురావడానికే జై భారత్ నేషనల్ పార్టీ పుట్టిందని ఆయన అన్నారు. తాము ఎవ్వరికీ తలవంచం, సాగిలపడమని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధితో అవసరాలు తీరుస్తామని లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. అభివృద్ధి అని కొందరు అవసరాన్ని పక్కన పెట్టారు.. మరొక్కరు అవసరాలు అని అభివృద్దిని పక్కన పెట్టారని అయితే అభివృద్ధి చేస్తూ అవసరాలు తీర్చే పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ అని ఆయన అన్నారు. ఒకప్పుడు డాలర్‌కి సమానంగా రూపాయి ఉండేదని.. నేడు పరిస్థితి దారుణం ఉందన్నారు. 

ప్రజాస్వామ్యం కోసం వెతుక్కొనే పరిస్థితి నేడు ఉంది.. ప్రజాస్వామ్యం కాపాడడానికి పార్టీ పెట్టామని లక్ష్మీనారాయణ తెలిపారు. మానవ హక్కులు , శాంతి భద్రతలను కాపాడడానికి పార్టీ పెట్టామని ఆయన చెప్పారు. వెయ్యి కిలోమీటర్ల సముద్ర తీరం మనకు ఉందని... గ్రామాల్లో పరిశ్రమలు స్థాపిస్తే , ఉపాధి అవకాశాలు కల్పిస్తే యువత పక్క రాష్ట్రాలకు పోరని లక్ష్మీనారాయణ వెల్లడించారు. వైజాగ్‌లో జాబ్ మేళా పెడితే 70 శాతం నిరుద్యోగులు వచ్చారని.. అందరూ ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారేనని ఆయన తెలిపారు. 

తాము తప్పు చేయం.. అప్పు చేయం, తప్పు చేసిన వారికి అండగా నిలవమని లక్ష్మీనారాయణ చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ను గుజరాత్ కంటే ముందుకు తీసుకొని వెళతామని ఆయన వెల్లడించారు. రాష్ట్రం చీకటిలో ఉంటే తాను పెట్టే చిరు దీపం పెట్టడాన్ని చూడడానికి మా అమ్మ వచ్చారని ఆయన తెలిపారు. రాష్ట్రం చీకటిలో ఉందని.. చిరు దీపం మేము వెలిగిస్తున్నామన్నారు. త్వరలో పార్టీ వివరాలతో ఒక వెబ్ సైట్ కూడా లాంచ్ చేస్తున్నామని జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు. అంగబలం, ఆర్థిక బలం ఇవ్వాలని ఆయన కోరారు. ప్రతి విషయంలో ఆంధ్రప్రదేశ్‌ను ముందుకు తీసుకెళ్లాడమే తన ఆశయమన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios