న్యూఢిల్లీకి చేరుకున్న కిరణ్ కుమార్ రెడ్డి: నేడు బీజేపీలో చేరిక
బీజేపీలో చేరేందుకు ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఇవాళ న్యూఢిల్లీకి చేరుకున్నారు.
న్యూఢిల్లీ: మాజీ ఏపీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. శుక్రవారంనాడు ఆయన బీజేపీలో చేరనున్నారు. ఇటీవలనే ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
ఈ ఏడాది మార్చి 12వతేదీన కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి పంపారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగగా కిరణ్ కుమార్ రెడ్డి పనిచేశారు.
ఉమ్మడి ఏపీ రాష్ట్రాన్ని విభజన చేయకుండా ఉంచేందుకు కిరణ్ కుమార్ రెడ్డి చివరి వరకు ప్రయత్నించారు.
ఈ విషయమై ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో అమీతుమీకి కూడా సిద్దమయ్యారు. 2014 ఎణ్నికలకు ముందు స్వంతంగా పార్టీని ఏర్పాటు చేసుకొని కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేశారు. కానీ కిరణ్ కుమార్ రెడ్డి పార్టీకి ఒక్క సీటు కూదా దక్కలేదు.
2014 ఎన్నికల తర్వాత ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏపీ ఇంచార్జీగా ఉమెన్ చాందీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డితో సమావేశమయ్యారు. అనంతరం కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఏపీ ఇంచార్జీగా బాధ్యతలు స్వీకరించాలని పార్టీ నేతలు చేసిన ప్రతిపాదనను కిరణ్ కుమార్ రెడ్డి నిరాకరించారని సమాచారం.
జాతీయ స్థాయిలో కిరణ్ కుమార్ రెడ్డికి కీలక పదవి దక్కే అవకాశం ఉందని ప్రచారం సాగింది. కానీ అలా జరగలేదు. అయితే ఏపీపై బీజేపీ నాయకత్వం కేంద్రీకరించింది. దీంతో కిరణ్ కుమార్ రెడ్డితో ఆ పార్టీ చర్చలు జరిపింది. దీంతో బీజేపీలో చేరేందుకు కిరణ్ కుమార్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. బీజేపీలో చేరేందుకు కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు.