తిరుమలలో మాదిరిగానే శ్రీశైలంలోనూ భక్తులను వన్యప్రాణులు భయపెడుతున్నాయి.
శ్రీశైలం : తిరుమల శ్రీవారి దర్శనానికి వెళుతున్న చిన్నారిని చిరుతపులి ఎత్తుకెళ్లిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన మరిచిపోకముందే మరో పుణ్యక్షేత్రం శ్రీశైలంలో ఎలుగుబంటి కలకలం సృష్టించింది. శ్రీశైలం ఆలయం కూడా తిరుమల మాదిరగానే అటవీప్రాంతంలో వుండటంతో తరచూ వన్యప్రాణులు కనిపిస్తుంటాయి. అయితే ఎలుగుబంటి వంటి భయంకరమైన జంతువు ఆలయ పరసరాల్లోకి రావడంతో మల్లికార్జున స్వామి దర్శనంకోసం వచ్చిన భక్తులు భయాందోళనకు గురవుతున్నారు.
కొద్దిరోజుల క్రితమే శ్రీశైలం సమీపంలోని శిఖరేశ్వరం ఆలయం వద్ద ఇలాగే ఎలుగుబంటి హల్ చల్ చేసింది. పక్కనే వున్న అడవిలోంచి ఆలయంలోకి వచ్చిన ఎలుగుబంటి భక్తులు కొట్టే కొబ్బరికాయలను తింటూ కనిపించింది. ఆలయంలో ఎలుగుబంటిని చూసిన భక్తులు భయంతో పరుగుతీసారు. అయితే ఆ ఎలుగుబంటి ఎవ్వరికీ ఎలాంటి హాని తలపెట్టకుండా కేవలం కొబ్బరికాయలు తినేసి అక్కడినుండి వెళ్లిపోయింది.
వీడియో
ఇదిలావుంటే ఇటీవల తిరుమలలో వన్యప్రాణుల సంచారం భక్తులను భయాందోళనకు గురిచేస్తోంది. కొద్దిరోజుల క్రితమే ఓ కుటుంబం కాలినడకన కొండపైకి వెళుతుండగా చిరుత చిన్నారిని ఎత్తుకెళ్లింది. అయితే ఆ చిన్నారి ప్రాణాలతో బయటపడింది. కానీ తాజాగా లక్షిత అనే పాపను నడకమార్గం నుండి ఎత్తుకెళ్లిన చిరుత చంపేయడం కలకలం రేపింది. తాజాగా ఇదే నడకమార్గంలో ఎలుగుబంటి హల్ చల్ చేసింది. ఇవాళ ఉదయం భక్తులు కొండపైకి వెళుతుండగా 2000వ మెట్టు వద్ద ఎలుగుబంటి కనిపించింది. దీంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు.
ఇదిలాఉంటే తిరుమలలో చిన్నారి లక్షితపై దాడి చేసిన చిరుత ఎట్టకేలకు ఫారెస్ట్ అధికారులకు చిక్కింది. భక్తులపై దాడిచేస్తున్న చిరుతను పట్టుకోవడానికి అటవీ అధికారులు తీవ్రంగా శ్రమించారు. లక్షితను ఎత్తుకెళ్లిన ప్రాంతంతో పాటు సమీపంలోని మరో మూడు ప్రాంతాల్లో ఫారెస్ట్ అధికారులు సీసీ కెమెరాలు, బోనులు ఏర్పాటు చేశారు. సోమవారం తెల్లవారుజామున ఏడో మైలు వద్ద ఉన్న బోనులో చిరుత చిక్కిందని అధికారులు తెలిపారు.
