ప్రమాదవశాత్తూ తల్లి చేతుల్లోనుంచి జారిపడి ఓ ఐదునెలల చిన్నారి మృత్యుఒడిలోకి జారుకున్నాడు. ఈ విషాదకర ఘటన కడప జిల్లాలో చోటు చేసుకుంది. ఈ వివరాలు ఇలా ఉన్నాయి. 

కడప : ముక్కుపచ్చలారని ఐదునెలల బాలుడి ప్రాణాలు ప్రమాదవశాత్తూ గాల్లో కలిసిపోయిన విషాద సంఘటన కడప నగర శివార్లలో బుధవారం తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ సంఘటనపై స్థానికులు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కడప నగరంలోని తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో రామచంద్రాపురంలో నివాసం ఉంటున్న పుల్లయ్య ఫాతిమా మెడికల్ కాలేజీలో పనిచేస్తున్నాడు. పుల్లయ్య, భారతి దంపతులకు ఇద్దరు కుమార్తెలున్నారు. ఐదు నెలల క్రితం ఒక బాబు పుట్టాడు. బుధవారం తెల్లవారుజామున భారతి తన కుమారుడిని చేత పట్టుకుని, మొదటి అంతస్తు నుంచి రెండో అంతస్తు తీసుకెడుతున్న సమయంలో ఆమె చీర స్టెప్స్ కు తగులుకోవడంతో పిల్లాడు ఆమె చేతిలో నుంచి జారి స్టెప్స్ మీదుగా కిందపడిపోయాడు. 

దీంతో షాక్ కు గురైన భారతి తేరుకునేలోపే మృత్యువాత పడ్డాడు. స్థానికంగా వైద్యుల దగ్గరికి తీసుకుని వెళ్లేసరికే మరణించాడని నిర్థారించారు. ఆ సమయంలోనే తనను ఎవరో లాగినట్లుగా బాలుడి తల్లి భారతి భావించింది. ఈ క్రమంలోనే చైన్ స్నాచింగ్ చేసేందుకు ఎవరో వ్యక్తి వచ్చినట్టు కలకలం రేగింది. ఈ సంఘటన మీద కడప తాలూకా సీఐ కె. ఉలసయ్య ఆదేశాల మేరకు ఎస్ఐ ఎస్ కెఎం హుసేన్ తమ సిబ్బందితో వెళ్లి పరిశీలించారు. వాస్తవానికి తల్లి భారతి, తమ ఐదు నెలల పిల్లాడిని పై అంతస్తులోకి తీసుకుని వెళ్లే క్రమంలో చీర, స్టెప్స్ కు తగిలి జారిపడినట్టుగా, అదే సమయంలో తల్లి భారతి షాక్ కు గురైందని, ప్రమాదవశాత్తు బాలుడు మృతి చెందినట్లుగా ప్రాథమికంగా తెలుస్తోందని పోలీసులు తెలియజేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాట్లు కడప తాలూకా సీఐ కె. ఉలసయ్య తెలియజేశారు.

ఇదిలా ఉండగా, విశాఖ కింగ్ జార్జ్ హాస్పిటల్‌లో కలకలం రేగింది. ఐదు రోజుల పసికందును కొందరు గుర్తు తెలియని దుండుగులు ఎత్తుకెళ్లారు. ఇద్దరు మహిళలు ఒకరు నర్సుగా.. ఇంకొకరు ఆయాగా నటించి పసికందును ఎత్తుకెళ్లారు. కిడ్నాప్‌నకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. పోలీసులు ఈ సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. శిశువును ఎత్తుకెళ్లిన ఆ ఇద్దరు మహిళ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇదిలా ఉండగా, కనిపించకుండా పోయిన శిశువు తల్లిదండ్రులు, వారి బంధువులు హాస్పిటల్‌లో ఆందోళనలు చేస్తున్నారు.

విశాఖ కింగ్ జార్జ్ హాస్పిటల్‌లో గైనిక్ వార్డులో నుంచి పసికందును ఎత్తుకెళ్లారు. నిన్న రాత్రి 7.30 గంటల నుంచి 8.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. శిశువుకు పలు పరీక్షలు చేయాల్సి ఉంటుందని చెప్పి ఇద్దరు మహిళలు కలిసి ఎత్తుకెళ్లినట్టు తెలిసింది. ఒక రకంగా బలవంతంగానే పసికందును ఎత్తుకెళ్లారని బంధువులు చెప్పారు. కాగా, పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. ఆ మహిళలు ఎవరు? ఎందుకు వచ్చారు? ఎలా వచ్చారు? వంటి విషయాలను పోలీసులు ఆరా తీస్తున్నారు.