ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్... తొలిసారి శాసన మండలిలోకి అడుగుపెట్టారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా సోమవారం జగన్ శాసన మండలికి వెళ్లారు. ఈ సందర్భంగా శాసన మండలి సభ్యులకు సీఎం జగన్ నమస్కరించారు.  ఈ సందర్భంగా వైసీపీ శాసనమండలి సభ్యులను వైఎస్ జగన్ ఆప్యాయంగా పలకరించి.. చేయి కలిపారు. 

ఈ క్రమంలో టీడీపీ నేతైన లోకేష్ కి కూడా జగన్ నమస్కరించారు. అనంతరం తన సీటులో నుంచి లేచి వచ్చిన టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌.. జగన్‌కు షేక్ హ్యాండిచ్చారు. ఇదిలా ఉంటే.. వైఎస్ జగన్ ఇంత వరకూ శాసనమండలికి వెళ్లలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా జగన్ మండలిలో అడుగుపెట్టలేదు. 
 
కాగా.. ప్రస్తుతం ప్రత్యేక హోదా విషయమై శాసనమండలిలో చర్చ జరుగుతోంది. అంతకముందు మంత్రులు అవంతి శ్రీనివాస్, బొత్స సత్యనారాయణ ప్రత్యేక హోదా, వైసీపీ ఎంపీల రాజీనామా గురించి మాట్లాడారు. ఇదిలా ఉంటే.. శాసనసభలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగుతోంది.