కృష్ణాజిల్లా కంకిపాడుడ మండలం కొనతణపాడులోని బ్రాటినియా పరిశ్రమ గోడౌన్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో దాదాపు రూ.10కోట్ల ఆస్తి నష్టం సంభవించింది. రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో 75 వేల చదరపు అడుగుల్లో నిర్మించిన గొడౌన్‌లో శనివారం తెల్లవారజామున మంటలు చెలరేగాయి. 

మంటలు అధికంగా వ్యాపించడంతో.. క్షణాల్లో గోడౌన్ లోని సరుకు కాలి బూడిదయ్యింది.  ప్రమాదం గురించి తెలుసుకున్న ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఆరు ఫైరింజన్లతో మంటలను ఆర్పే ప్రయత్నం చేసినా అదుపులోకి రాలేదు. కాగా, ఈ గొడౌన్‌కు ఫైర్ సేఫ్టీ అనుమతులు కూడా లేవని అధికారులు పేర్కొన్నారు. విజయవాడ నగరం మొత్తానికి అతిపెద్ద గొడౌన్‌గా చెప్పుకునే దీనికి కనీస అనుమతులూ లేకుండా నిర్మించడం గమనార్హం.  దాదాపు ఆరుగంటల పాటు కష్టపడి మంటలను అదుపుచేసినట్లు అధికారులు తెలిపారు.

ఈ మంటలకు పక్కన ఉన్న అపార్ట్‌మెంట్ గోడలు కూడా వేడెక్కిపోవడంతో అందులో జనాలు భయంతో పరుగులు తీసే పరిస్తితి ఏర్పడింది. షార్ట్ షర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.