ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన బాలినేని శ్రీనివాసరెడ్డి విజయోత్సవ ర్యాలీలో అపశ్రుతి చోటుచేసుకుంది. బాలినేనికి మంత్రి పదవి దక్కడం పట్ల ఆయన అభిమానులు సంబరాలు చేసుకున్నారు. అయితే... ఈ సంబరాల కారణంగా ఓ గోదాం అగ్నికి ఆహుతైంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... మంత్రి శ్రీనివాస రెడ్డి ప్రమాణ స్వీకారం అనంతరం భారీ ఊరేగింపుతో ఒంగోలు వెళుతున్నారు. ఈ సందర్భంగా విజయ యాత్ర ఏడుగుండ్లపాడు వద్దకు రాగానే ఆయన అభిమానులు కాల్చిన టపాసులు పక్కనేవున్న పొగాకు గోదాంపై పడ్డాయి. 

దీంతో.. వెంటనే నిప్పులు చెలరేగి..  మంటలు వ్యాపించాయి. దీంతో.. గోదాం మొత్తం పూర్తిగా కాలి బూడిదయ్యింది. గుర్తించిన స్థానికులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా, సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. గ్రేడింగ్‌ కేంద్రంలో వారం రోజుల క్రితం బెంగళూరు, మైసూరు ప్రాంతాల నుంచి పదికి పైగా లారీల పొగాకు కొనుగోలు చేసి నిల్వ ఉంచారు. రూ. 10 లక్షల ఆస్తి నష్టం సంభవించిందని నిర్వాహకులు వాపోయారు.