విశాఖపట్నం: ఫాని తుఫాన్ తీవ్ర రూపం దాల్చుతోంది. ముందుగా చెప్పుకున్నట్లే ఉత్తరాంధ్రలో ఫాని తుఫాన్ ప్రభావం మెుదలైంది. ఉత్తరాంధ్రలోని సముద్ర తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయి. మరోవైపు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. 

ఇకపోతే సముద్ర తీరం అంతా అల్లకల్లోలంగా మారుతుంది. ముఖ్యంగా విశాఖ తీరంతోపాటు భీమిలిలో అలలు ఎగసిపడుతున్నాయి. 10 మీటర్ల మేర అలలు ఎగిసిపడుతున్నాయి. సాయంత్రం నుంచి ఉత్తరాంధ్రలో చిరుజల్లులు కురుస్తుండగా రాత్రికి వర్షం పెరిగింది. 

వరుణుడుకు వాయుదేవుడు తోడైనట్లు గాలి కూడా బలంగానే వీస్తోంది. ఫాని తుఫాన్ ప్రభావంతో మే 2, 3 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ తుఫాన్ ప్రభావం శ్రీకాకుళం జిల్లాపై ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. 

ఫాని తుఫాన్ తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారుల ఆదేశించారు. తీర ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలను సైతం అధికారులు సిద్ధం చేశారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ నివాస్ జిల్లా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. 

జిల్లా వ్యాప్తంగా తుఫాన్  ప్రభావం ఉన్న మండలాల్లో 48 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలోని 11 మండలాల్లో 237 తుఫాను ప్రభావిత గ్రామాలు గుర్తించారు. వంశధార నదీతీరంలో 117 గ్రామాలతోపాటు నాగావళి నదీతీరంలో 107 గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. 

సహాయక చర్యల కోసం ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌, డీడీఆర్‌ఎఫ్‌ బృందాలతో పాటు 32 బోట్‌ టీమ్‌లను సిద్ధంగా ఉంచారు. మరోవైపు 11 తీర ప్రాంతాలకు సంబంధించి ప్రత్యేక అధికారులను నియమించారు. అలాగే కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదేశించారు.