అందరి సంతోషం కోసం నిరంతరం తపించారు నాన్న.. మీ స్పూర్తే నన్ను నడిపిస్తోంది - సీఎం వైఎస్ జగన్
నేడు ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్ తన తండ్రిని గుర్తుచేసుకున్నారు. ట్విట్టర్ లో భావోద్వేగ పోస్టు పెట్టారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి నేడు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ కార్యకర్తలు జయంతి వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. తెలంగాణలోనూ ఆయన అభిమానులు జయంతి వేడుకలు నిర్వహించనున్నారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా తన తండ్రిని గుర్తు చేసుకుంటూ ఏపీ సీఎం జగన్ ట్విట్టర్ లో ఓ భావోద్వేగ ట్వీట్ చేశారు. అందులో ‘‘ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలని, ప్రతీ ఇంట్లో గొప్ప చదువులు చదవాలని, సుఖసంతోషాలతో ప్రతి ఒక్కరూ ఉండాలని మీరు నిరంతరం తపించారు నాన్నా. అదే ప్రజలందరి హృదయాల్లో మీ స్థానాన్ని సుస్థిరంచేసింది. ఆ ఆశయాల సాధనలో మీ స్ఫూర్తి నన్ను ప్రతిక్షణం చేయిపట్టి నడిపిస్తోంది. మీ జయంతి మాకందరికీ ఒక పండుగ రోజు.’’ అని పోస్టు చేశారు.