కంటికి రెప్పలా కాపాడాల్సిన కూతురిపై అత్యాచారానికి పాల్పడి ఆమెను తల్లిని చేశాడో తండ్రి. వివరాల్లోకి వెళితే... నెల్లూరు జిల్లా జలదంకి మండలం బ్రాహ్మణక్రాక పంచాయతీలోని హనుమకొండపాళెం గ్రామానికి చెందిన కర్ర బాలరాజు బేల్దారి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

అతనికి భార్య, కుమారుడు ఉన్నారు. భార్య అనారోగ్యానికి గురికావడంతో బాలరాజు రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు, కూతురు సంతానం. రెండో భార్య కూతురు స్థానిక పాఠశాలలలో పదో తరగతి చదువుతోంది.

కన్నబిడ్డపై కన్నేసిన బాలరాజు.. మూడు నెలల నుంచి బలవంతంగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఈ విషయం కుటుంబసభ్యులకు తెలిసినప్పటికీ వారు పరువు పోతుందనే భయంతో మౌనంగా వున్నారు.

ఈ క్రమంలో బాలిక అస్వస్థతకు గురికావడంతో సోమవారం కుటుంబసభ్యులు ఆమెను కావలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాలికను పరీక్షించిన వైద్యులు ఆమె గర్భం దాల్చినట్లుగా నిర్థారించారు.

విషయం పోలీసులకు తెలియడంతో రంగంలోకి దిగిన వారు ఆస్పత్రికి చేరుకోగానే... బాలరాజు అక్కడి నుంచి పారిపోయాడు. దీనిపై బాలిక కుటుంబసభ్యులను విచారించగా.. బహిర్భూమికి వెళ్లినప్పుడు తమ కుమార్తెపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారని పొంతన లేని సమాధానం చెప్పారు.

అయితే పోలీసులు బాలిక తండ్రి గురించి తమదైనశైలిలో ఆరా తీయగా.. తండ్రే బాలికను గర్భవతిని చేసి.. అబార్షన్ చేయించడానికి ఆస్పత్రికి వచ్చినట్లు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలరాజు గురించి గాలిస్తున్నారు.