ప్రకాశం జిల్లా చీమకుర్తిలో మూడేళ్ల బాలుడు అదృశ్యం కేసు విషాదంగా ముగిసింది. కన్నతండ్రే ఆ బాబుని చంపినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. వివరాల్లోకి వెళితే చీమకుర్తి మండలం యల్లయ్యనగర్‌కు చెందిన షేక్ ఖాదర్‌వలి, సల్మా దంపతులు బిడ్డతో కలిసి ఉంటున్నారు.

అయితే భార్యభర్తల మధ్య విభేదాలు ఉన్నాయి.. ఈ క్రమంలో గత నెల 29న యల్లయ్యనగర్‌లో బంధువుల ఇంట్లో వేడుక ఉండటంతో అక్కడికి భార్యభర్తలు వచ్చారు. ఫంక్షన్ ముగించుకుని ఖాదర్ వల్లి యల్లయ్యనగర్‌లోనే ఉండాలనుకున్నాడు..

అయితే భార్య సల్మా మాత్రం నెల్లూరుకు వెళ్లాలనే ఉద్దేశంతో 30వ తేదీన తన సోదరులను పిలిపించుకుంది. దీనిని గమనించిన ఖాదర్‌వలి భార్య, కొడుకు నెల్లూరు వెళ్లిపోతారేమోనని భావించి, కొడుకును దగ్గరుకు తీసుకునే ప్రయత్నం చేశాడు.

దీనికి సల్మా అడ్డుపడింది.. ఆ సమయంలో వీడు నీ బిడ్డ కాదు, నీకు పుట్టలేదు అంటూ కర్కశంగా మాట్లాడింది. భార్య అన్న మాటలకు మనస్తాపానికి గురైన ఖాదర్‌వలి.. 30వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు సాహుల్‌ను తినుబండారాలు కొనిపెడతానంటూ బజారుకు తీసుకెళ్లాడు.

అక్కడి నుంచి ఎర్రకొండ సమీపంలో జన సంచారం లేని కొండల్లోకి తీసుకెళ్లి గొంతు నులిమి హత్య చేశాడు. అయినా ప్రాణాలతో ఉంటాడేమోనన్న అనుమానంతో వెంట తీసుకెళ్లిన కత్తితో గొంతు కోసి అక్కడే ఉన్న రాళ్ల మధ్యలో పడేశాడు.

అనంతరం ఏమీ తెలినట్లుగా సాయంత్రం 5.30 గంటల సమయంలో ఇంటికి తిరిగి వచ్చేశాడు. బాబుకు కుర్‌కురే కొనిచ్చి ఇంటి దగ్గర దిగబెట్టానని ఖాదర్‌ బంధువులకు చెప్పాడు.

ఎంత వెతికినా కొడుకు జాడ లేకపోవడంతో సల్మా ఈ నెల 30న చీమకుర్తి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దానితో పాటు భర్త మీదే అనుమానంగా ఉందని చెప్పింది. దీంతో పోలీసులు ఖాదర్‌వలి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

గత శనివారం చీమకుర్తి బైపాస్ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా ఆర్టీసీ బస్సు నుంచి దిగిన ఖాదర్‌వలి పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశాడు. అతడిని గమనించిన పోలీసులు వెంటాడి పట్టుకున్నారు.

అనంతరం పీఎస్‌కు తరలించి విచారించగా.. తన కొడుకును తానే చంపినట్లు అంగీకరించాడు. మరోవైపు 2011లో యల్లయ్యనగర్‌లో జరిగిన ఒక అత్యాచారయత్నం కేసులోనూ ఖాదర్‌వలిపై కేసు నమోదైనట్నలు పోలీసులు తెలిపారు.