విజయవాడ: అసలే అకాల వర్షాలకు పంట నష్టపోయి, దిగుబడి లేక కనీసం పెట్టిన పెట్టుబడి రాని పరిస్థితుల్లో వున్న రైతులు గిట్టుబాటు ధర అందక మరింత నష్టపోతున్నారు. ఇలా భూమిని కౌలుకు తీసుకుని పండించిన పంటకు మార్కెటింగ్ అధికారులు, బయ్యర్లు సరైన గిట్టుబాటు ధర ఇవ్వకపోవడంతో మనస్థాపానికి గురయిన ఓ రైతు ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన విషాద సంఘటన కృష్ణాజిల్లాలో చోటుచేసుకుంది. 

కృష్ణాజిల్లా చందర్లపాడు పట్టణంలో కట్టా లక్ష్మీనారాయణ అనే రైతు కొన్ని సంవత్సరాలుగా పొలం కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. ఇలా ఈ సంవత్సరం కూడా 15 ఎకరాల పొలం కౌలుకు తీసుకొని ప్రత్తి సాగు చేశాడు. అయితే ఈ సంవత్సరం తొలకరిలో పడిన వర్షాలకు పత్తి బాగానే దిగుబడి వస్తుందని భావించిన ఈ రైతు ఆశలపై అకాల వర్షాలు నీళ్లు చల్లాయి. ఈ వర్షాల వల్ల పంట పూర్తిగా దెబ్బతిని దిగుబడి తక్కువ వచ్చింది. 

ఎకరాకు రూ.40 వేల చొప్పున మొత్తం 15 ఎకరాలకు రూ.6 లక్షల వరకు పెట్టుబడి పెట్టాడు. ఇదంతా అప్పు తీసుకొని వచ్చి వ్యవసాయం చేశాడని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే మార్కెటింగ్ అధికారులు, బయ్యార్ల కుమ్మక్కుతో కనీసం మద్దతు ధర రాకపోవడంతో కనీసం పెట్టుబడి వస్తుందేమోననే  అతనికి నిరాశే మిగిలింది.  ఈ క్రమంలో మనస్థాపానికి గురైన సదరు కౌలు రైతు గత అర్ధరాత్రి పొలంలో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. 

పొద్దున ఈ విషయాన్ని గమనించిన తోటి రైతులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.