గ్రామంలోని ఓ స్థల వివాదంలో ఓ వ్యక్తి తలదూర్చుతున్నాడనే కారణంతో గ్రామస్తులు అతనిపై కుల బహిష్కరణ వేటు వేశారు. ఇదేదో ఉత్తరప్రదేశ్,బిహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో జరిగింది కాదు. మన ఆంధ్రప్రదేశ్‌లోనే.  

వివరాల్లోకి వెళితే... ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం ఈతముక్కల పల్లెకి చెందిన నాయుడు బ్రహ్మయ్య అనే వ్యక్తి ఓ స్థల వివాదంలో తలదూర్చాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన వారు.. అతనిని కులం నుంచి వెలేస్తున్నట్లు ప్రకటించారు.

దీంతో రెండు రోజుల్లో జరగాల్సిన ఆయన కొడుకు పెళ్లికి కూడా ఆటంకం కలిగే పరిస్థితి ఏర్పడింది. కరోనా కాలంలో బయటి వ్యక్తులు గ్రామంలోకి.. గ్రామంలోని వ్యక్తులు బయటికి వెళ్లడానికి వీల్లేదని గ్రామస్తులు తీర్మానం చేసుకున్నారు.

బ్రహ్మయ్య కుటుంబాన్ని బహిష్కరిస్తున్నట్లు గ్రామంలో చాటింపు వేశారు. దీంతో ఆయన తనకు జరిగిన అన్యాయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు గ్రామాన్ని సందర్శించి పెద్దలతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు.