నెల్లూరు: భార్యను ఎంతో అపురూపంగా చూసుకునే మంచి భర్త. ఇద్దరు అమ్మాయిలను అల్లారుముద్దుగా పెంచుతున్నాడు. ఎంతో అన్యోన్యమైన కుటుంబం వాళ్లది.  పిల్లలన్నా భార్యన్నా అతనికి విపరీతమైన ప్రేమ. అంతే అపురూపంగా చూసుకునేవాడు. భర్తను కూడా ఆమె ఎంతో ప్రేమగా చూసుకునేది. ఆడపిల్లలిద్దరూ తండ్రి కూచీయే. 

తండ్రిని వదిలిపెట్టి అసలు ఉండలేదు. ప్రేమానుబంధాలు అల్లుకున్న ఆ పొదరిల్లపై ఎవరికి కన్నుకుట్టిందో తెలియదు  కానీ గుండెపోటుతో యజమాని మృతి చెందాడు. తనను ఎంతో ప్రేమించే భర్త లేడని భావించిన ఆ ఇల్లాలు అతని లేని జీవితం వ్యర్థమనుకుంది. 

తన ఇద్దరు కుమార్తెలతో కలిసి ఉరేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ దుర్ఘటనలో పెద్దకుమార్తె మృతిచెందగా...భార్య, చిన్నకుమార్తె ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ విషాద ఘటన నెల్లూరు జిల్లా రంగనాయకులపేట గురుతోటలో చోటు చేసుకుంది. 

వివరాల్లోకి వెళ్తే నెల్లూరు  జిల్లా నెల్లూరు టౌన్ సమీపంలోని రంగనాయకులపేట గురుతోట ఒకటో వీధిలో ముంగర కొండలరావు (50), సుజాత దంపతులు నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు విష్ణువర్ధిని (13), దివ్యసోనిక(9 )ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె ఏడో తరగతి, చిన్నకుమార్తె ఐదో తరగతి చదువుతున్నారు. కొండలరావు గతంలో కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి వద్ద పీఏగా పనిచేశారు.

ఆ తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఆర్థికంగా బాగానే సంపాదిస్తున్నాడు. భార్య, పిల్లలంటే కొండలరావుకు విపరీతమైన ప్రేమ. వ్యాపారం ఎలా ఉన్న కుటుంబానికే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేవాడు. భార్య, పిల్లలను ఎంతో అపురూపంగా చూసుకునేవారు. వ్యాపారవ్యహారాల నిమిత్తం కొండలరావు తరచూ హైదరాబాద్‌కు వెళ్లేవాడు. వారం, పది రోజుల పాటు అక్కడే ఉండి వ్యాపార లా వాదేవీలు చూసుకుని తిరిగి ఇంటికి వచ్చేవాడు. 

నాలుగురోజుల క్రితం కొండలరావు హైదరాబాద్ వెళ్లాడు. అబిడ్స్‌లోని బృందావనం లాడ్జిలో ఓ గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. ఆదివారం ఉదయం  గుండెపోటు రావడంతో లాడ్జిలోనే మృతి చెందాడు. లాడ్జి యాజమాన్యం అబిడ్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. కొండలరావు వద్ద లభ్యమైన ఫోను నంబర్లు ఆధారంగా అతని స్నేహితుడైన నెల్లూరు గురుతోటకు చెందిన ల్యాండ్రి యజమాని వెంకటేశ్వర్లుకు సమాచారం అందించారు.

ఆదివారం కావడంతో సుజాత తన పిల్లల కోసం చికెన్, దోసెలు చేసింది. ముగ్గురూ టిఫిన్‌ తింటుండగా వెంకటేశ్వర్లు కొండలరావు మృతి చెందాడన్న విషయాన్ని వారికి తెలియజేశాడు. దీంతో వారు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. గుండెలు పగిలేలా రోదించారు. ఆ తర్వాత కొండలరావు మృతి విషయాన్ని బంధువులకు సైతం తెలియజేశాడు వెంకటేశ్వర్లు. 

కొండలరావు లేడన్న విషయాన్ని జీర్ణించుకోలేని అతని భార్య సుజాత కుమార్తెలు ఉరేసుకుని ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టారు. బంధువులు హుటాహుటిన కొండలరావు ఇంటి వద్దకు వచ్చారు. తలుపులు తెరిచేందుకు ప్రయత్నించగా తెరుచుకోకపోవడంతో బంధువులు ఆందోళన చెందారు. స్థానికుల సహాయంతో తలుపులు తెరిచి చూడగా పెద్దకుమార్తె విష్ణువర్ధిని ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది. 

సుజాత, చిన్న కుమార్తె దివ్యసోనిక బెడ్ రూమ్ లో ఆపస్మారక స్థితిలో పడి ఉన్నారు. ఉరేసుకోవడం కుదరకపోవడంతో హిట్, హార్పిక్స్‌లను తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. దివ్యసోనిక ముక్కు, నోట్లో నుంచి రక్తం రావడాన్ని గమనించారు. వెంటనే సుజాత, ఆమె కుమార్తెను చికిత్స నిమిత్తం హుటాహుటిన నగరంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నారాయణ హాస్పిటల్‌కు తరలించారు.

ఆత్మహత్య ఘటనపై పోలీసుకు స్థానికులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన సంతపేట పోలీసులు విచారణ చేపట్టారు. పెద్దకుమార్తె విష్ణువర్ధిని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్ కు తరలించారు. 

 
అందరితో స్నేహంగా ఉండే కొండలరావు హైదరాబాద్ లో మృతిచెందడం అతని మరణాన్ని తట్టుకోలేక పెద్దకుమార్తె విష్ణువర్ధిని ఉరివేసుకుని మృతి చెందండం, అతని భార్య సుజాత, కుమార్తె దివ్యసోనిక ప్రాణాపాయస్థితిలో ఆస్పత్రిలో ఉండడంతో గురుతోటలో విషాదచ్ఛాయలు అలుముకున్నాయి. 

విషయం తెలుసుకున్న స్థానికులు ఎత్తున ఘటనా స్థలానికి చేరుకుని విష్ణువర్ధిని మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. మధ్యాహ్నాం వరకు తమ పిల్లలతో ఆడుకున్న విష్ణువర్ధిని, దివ్యసోనికలను ఇలాంటి పరిస్థితుల్లో చూస్తామని అనుకోలేదని వారంతా కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.