వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌పై సోషల్ మీడియాలో దుష్ప్రచారం.. అసలు వాస్తవం ఇదే..!!
కర్నూలు వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ వైద్య సిబ్బందిని అవమానపరిచారంటూ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు ప్రత్యక్షమయ్యాయి
దేశ ప్రజలు కరోనా కారణంగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమని గడుపుతున్నారు. ఇలాంటి పరిస్ధితుల్లో ధైర్యాన్ని నింపాల్సింది పోయి కొందరు ఆకతాయిలు సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు.
ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలపై సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం జరుగుతోంది. తాజాగా కర్నూలు వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ వైద్య సిబ్బందిని అవమానపరిచారంటూ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు ప్రత్యక్షమయ్యాయి.
ఓ గాయపడిన మత పెద్దకు వైద్యం అందిస్తున్న నర్స్ ఫోటోలు వైరల్ అయ్యాయి. దూరం నుంచి తీసిన ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన దుండగులు.. వాస్తవాన్ని దాచిపెట్టి వారికి నచ్చినట్లుగా దుష్ప్రచారం మొదలుపెట్టారు.
అయితే ఇందుకు సంబంధించిన అసలు వాస్తవాన్ని వైసీపీ నేతలు తెలియజేశారు. వివరాల్లోకి వెళితే.. రాయలసీమ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్‌ను ఎమ్మెల్యే హాఫీజ్ ఖాన్ 10 రోజుల కిందట సందర్శించారు.
అక్కడ అందిస్తున్న సౌకర్యాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అయితే ఆ సమయంలో అక్కడ గేట్ తగలడంతో ఓ ముస్లిం పెద్దాయన కాలికి గాయమైంది. అతను షుగర్ పేషెంట్ కావడంతో కాలి నుంచి రక్తం కారుతూనే ఉంది.
దీంతో క్వారంటైన్ సెంటర్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఓ నర్సు.. ఆయన గాయాన్ని శుభ్రపరిచి రక్తం బయటకు రాకుండా కట్టు కట్టారు. అయితే బ్లీడింగ్ ఆగకపోవడంతో ఆయనను మెరుగైన చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.