అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నకిలీ ఏసీబీ ముఠా గుట్టు రట్టయింది. హీరో సూర్య మూవీ గ్యాంగ్ సినిమా చూసి అచ్చం అలాగే అవినీతి అధికారులను లక్ష్యంగా చేసుకుని డబ్బులు వసూలు చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది. ఈ గ్యాంగ్ కు కర్నూలులో 16 చైన్ స్నాచింగ్ లకు పాల్పడిన శ్రీనాథ్ రెడ్డిని సూత్రధారిగా గుర్తించారు. 

నకిలీ ఏసీబీ ముఠా ఏపీలో 68 మంది అవినీతి అధికారులను ఆదాయానికి మించిన ఆస్తులున్నాయని బెదిరించినట్లు సమాచారం. అవినీతి అధికారుల జాబితాను సంపాదించి, దాని ఆధారంగా వారిని బెదిరిస్తూ డబ్బులు లాగినట్లు తెలుస్తోంది. ఆ ముఠా అవినీతి అధికారుల నుంచి పెద్ద యెత్తున డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం. 

శ్రీనాథ్ రెడ్డి జైలులోనే ఓ ముఠాను తయారు చేసినట్లు తెలుస్తోంది. బెయిలు మీద బయటకు వచ్చి సూర్య గ్యాంగ్ సినిమా చూసి అచ్చం అలాగే దందాకు దిగినట్లు చెబుతున్నారు. ఇప్పటికే ఈ ముఠాను రెండుసార్లు పోలీసులు అరెస్టు చేశారు. నెల్లూరు జిల్లాలో నలుగురు అధికారులు ఆ ముఠాకు డబ్బులు బదిలి చేసినట్లు తెలుస్తోంది.

నకిలీ ఏసీబి అధికారులకు నగదు ఇచ్చిన అధికారుల కార్యాలయాల్లో తాము సోదాలు నిర్వహించినట్లు ఏసీబీ జెడి గంగాధర్ చెప్పారు. 16 మంది అధికారులు నకిలీ ఏసీబీ ఖాతాలకు రూ.37 లక్షలు బదిలీ చేశారని చెప్పారు. ఏసీబీ అధికారుల వివరాలు కనుక్కున్ని నకిలీ ముఠా నేరాలకు పాల్పడుతోందని అన్నారు. కడపలో 3, విశాఖలో 2 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.