అమరావతి: స్వాతంత్ర్య సమరయోధుడు సైరా నరసింహారెడ్డి పేరు మీద తీసిన సైరా సినిమా పేరుతో మాజీ కేంద్ర మంత్రి, మెగాస్టార్ చిరంజీవి పెద్దలతో భేటీ కావడం వెనక సీక్రెట్ మిషన్ ఉందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సైరా సినిమా చూడాలని కోరడానికి ఆయన ప్రముఖ రాజకీయ నేతలను కలుస్తున్న విషయం తెలిసిందే. 

సైరా సినిమా చూడాలని కోరడానికి చిరంజీవి ఆ మధ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైఎస్ జగన్ ను కలిశారు. సైరా సినిమా చూడాలని ఆయన జగన్ ను కోరారు. చిరంజీవిని జగన్ కూడా కూడా ఆదరించారు. 

తెలంగాణ గవర్నర్ తమిళిసైని కూడా చిరంజీవి కలిసి సైరా సినిమా చూడాల్సిందిగా కోరారు. అదే సమయంలో ఆయన ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్ కోరారు. గత బుధవారంనాడు ఆయన ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడిని కలిశారు. వెంకయ్య నాయుడు తన నివాసంలో చిరంజీవి, ఆయన కుటుంబ సభ్యులతో కలిసి సైరా సినిమా చూశారు. 

నరేంద్ర మోడీతోనూ అమిత్ షాతోనూ మంచి సంబంధాలున్న నేతలతోనే ఇప్పటి వరకు చిరంజీవి భేటీ అయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతో మాత్రం ఆయన భేటీ కాలేదు. కేసీఆర్ కు మోడీతో ప్రస్తుతం అంత మంచి సంబంధాలు లేవు. అయితే, చిరంజీవి అపాయింట్ మెంట్ కోరినప్పటికీ కేసీఆర్ ఇవ్వలేదనే ప్రచారం సాగింది. ఇది ఎంత వరకు నిజమనేది తెలియదు. 

చిరంజీవి గతంలో యుపిఎ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. అయినప్పటికీ ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీతో గానీ రాహుల్ గాంధీతో గానీ భేటీకి ఆయన అపాయింట్ మెంట్ కోరలేదు. చాలా కాలంగా ఆయన కాంగ్రెసుకు దూరంగా ఉంటున్నారు. 

చిరంజీవి రాజ్యసభకు వెళ్లాలనే ఎజెండాతోనే సైరా మూవీ పేరున నేతలను కలుస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. షబానా ఆజ్మీ, జావేద్ అక్తర్, లతా మంగేష్కర్ ల మాదిరిగా తనను రాజ్యసభకు నామినేట్ చేయించుకోవాలనే ఆలోచన చిరంజీవికి ఉన్నట్లు చెబుతున్నారు. 

తాను, చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉంటున్నామని సినిమా చూసిన తర్వాత వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించినట్లు సమాచారం. చిరంజీవి కాంగ్రెసు సభ్యుత్వాన్ని పునరుద్ధరించుకోలేదు కూడా. అయితే, చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాల మీదనే పూర్తి స్థాయిలో దృష్టి పెడుతున్నారు. సైరా తర్వాత మరో సినిమా చేయడానికి కూడా సిద్ధపడ్డారు. 

అయితే, చిరంజీవి రాజకీయ ప్రయోజనాలు ఆశించడం లేదని, ఆయన ఎంత మాత్రమూ రాజ్యసభకు వెళ్లాలని అనుకోవడం లేదని ఆయన సన్నిహిత వర్గాలంటున్నాయి. గిట్టనివాళ్లే అటువంటి ప్రచారాలు చేస్తున్నారని కూడా వ్యాఖ్యానిస్తున్నాయి.