తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపిన కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్సీ హెచ్.ఎ.రెహ్మాన్‌కు న్యాయస్థానం మూడేళ్ల జైలు శిక్ష విధించింది. 2011 జూన్ 15న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ 15 సీట్లను గెలుచుకుని సంచలనం సృష్టించింది.

దీంతో పార్టీ కార్యకర్తలు, నేతలు హైదరాబాద్‌‌లోని పార్టీ కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. బాణాసంచా కాలుస్తూ....వేడుకలు నిర్వహించారు. ఈ క్రమంలో అప్పటి ఎమ్మెల్సీ హెచ్.ఎ.రెహ్మాన్‌ను పార్టీ కార్యకర్తలు ఎత్తుకోవడంతో... ఆయన ఆనందం పట్టలేకపోయారు.

వెంటనే జేబులో ఉన్న లైసెన్స్‌డ్ రివాల్వర్‌తో మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. ఆ సమయంలో అక్కడ భద్రతా విధులు నిర్వర్తిస్తున్న జూబ్లీహిల్స్ ఎస్.ఐ. సైదులు .. రెహ్మాన్‌పై ఐపీసీ 336, ఆయుధ చట్టంలోని సెక్షన్ 27(1) ప్రకారం కేసు నమోదు చేశారు.

ఈ కేసులో ఫిర్యాదుదారు... సాక్షి కూడా ఆయనే కావడంతో కేసు నిలబడదని అంతా భావించారు. అయితే పక్కా ఆధారాలతో సైదులు కోర్టులో చార్జీషీటు దాఖలు చేశారు. సాక్ష్యాధారాల సేకరణతో పాటు కౌంటర్లు దాఖలు చేయడం, డిఫెన్స్ క్రాస్ ఎగ్జామినేషన్‌లో సమాధానాలు ఇచ్చారు.

ఈ నేపథ్యంలో 17వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ బి. శ్రీనివాసరావు.... కాల్పులు జరిపింది వాస్తవమేనని నిర్థారించుకున్నారు. మాజీ ఎమ్మెల్సీ రెహ్మాన్‌కు మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.