రుణాల ఎగవేత, నిధుల మళ్లీంపు వ్యవహారంలో తమ ఎదుట హాజరు కావాలంటూ సీబీఐ జారీ చేసిన సమన్లపై టీడీపీ ఎంపీ సుజనా చౌదరి తెలంగాణ హైకోర్టులో సవాల్ చేశారు. రుణాల ఎగవేత, నిధుల దారి మళ్లీంపుపై బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ కంపెనీకి చెందిన ఆరుగురిపై 2017లో సీబీఐ కేసు నమోదు చేసిందని ఆ కంపెనీతో తనకు ఎలాంటి సంబంధం లేనప్పటికీ తనను విచారించేందుకు పిలిపించడం సరికాదని సుజనా తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దోషులను గుర్తించడం, విచారించడం సీబీఐ బాధ్యతని అయితే ఈ కేసులో ఎలాంటి సంబంధం లేకపోయినా తనకు నోటీసు ఇవ్వడం సరికాదని సుజనా ఆవేదన వ్యక్తం చేశారు. 2017లో బెస్ట్ అండ్ క్రాంప్టన్ కంపెనీ వ్యవహారంలో ఆంధ్రా బ్యాంకును రూ.71 కోట్ల మేర మోసం చేసినట్లు సుజనాపై కేసు నమోదైంది. దీనికి సంబంధించి 26న బెంగళూరు సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సిందిగా సుజనా చౌదరికి సమన్లు జారీ అయిన సంగతి తెలిసిందే.