కర్నూలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ కేంద్రమంత్రి, టీడీపీ నేత కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి. అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ గెలవడానికి కారణం ప్రధాని నరేంద్ర మోదీయేనని చెప్పుకొచ్చారు. 

మోదీ సపోర్టుతోనే జగన్ గెలవగలిగారని స్పష్టం చేశారు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి. ఎన్నికల్లో ట్యాంపరింగ్ జరిగిందని దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుందంటూ చెప్పుకొచ్చారు. మోసాలతో గెలిచిన పార్టీలు ఎక్కువ కాలం ఉండవంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  

శనివారం కర్నూలు జిల్లా టీడీపీ సమన్వయం కమిటీ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి వైసీపీ దాడులకు టీడీపీ కార్యకర్తలు అధైర్యపడొద్దన్నారు. వచ్చే జమిలి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సత్తా ఏంటో చూపిస్తామన్నారు. 

మరోవైపు వైయస్ జగన్ పాలనపై సెటైర్లు వేశారు. వైసీపీ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా ఉందని తీవ్ర విమర్శలు చేశారు. శ్రీశైలం నీటిని దోచుకుంటున్న కేసీఆర్‌ను సీఎం జగన్ మంచోడు అని కీర్తిస్తుండటం బాధాకరమంటూ కోట్ల విరుచుకుపడ్డారు.