అమరావతి: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలుగుదేశం పార్టీలోకి వలసల జోరు ఊపందుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వలసలతో వైసీపీ మంచి జోష్ లో ఉంది. తాజాగా తెలుగుదేశం పార్టీలో కూడా వలసలు ఊపందుకోవడంతో ఆ పార్టీ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. 

ఆదివారం కేంద్ర మాజీమంత్రి కాంగ్రెస్ పార్టీ కీలక నేత వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్ చంద్రబాబు నాయుడు సమక్షంలో సైకిలెక్కనున్నారు. అమరావతిలో ఉదయం 11.30 గంటలకు పార్టీ కండువా కప్పుకోనున్నారు. 

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఓ వెలుగు వెలిగిన ఆయన గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అరకు పార్లమెంట్ లో మంచి పట్టున్న నేత కావడంతో ఆయనను అరకు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దించాలని చంద్రబాబు నాయుడు యోచిస్తున్నారు. 

ఇకపోతే కాంగ్రెస్ పార్టీ అరకు పార్లమెంట్ అభ్యర్థిగా కిషోర్ చంద్రదేవ్ తనయ శృతీదేవి పోటీ చేయనున్నారు. తండ్రిపై పోటీకి కుమార్తె సై అనడంతో ఉత్తరాంధ్ర రాజకీయాలు హీటెక్కాయి. 

అటు ప్రముఖ వ్యాపారవేత్త, మాజీ వైసీపీ నేత చలమల శెట్టి సునీల్ సైతం తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. మార్చి మెుదటి వారంలో చలమల శెట్టి సునీల్ సైకిల్ ఎక్కనున్నారు. 

చలమలశెట్టి సునీల్ కాకినాడ తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ తోట నరసింహం కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారు. అనారోగ్య కారణాల వల్ల ఎంపీగా పోటీ చెయ్యలేనని అయితే జగ్గంపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని జగ్గంపేట తనకు కేటాయించాలని ఇటీవలే సీఎం చంద్రబాబును కోరారు.  

అలాగే మార్చి 6న కర్నూలు జిల్లా పాణ్యం వైసీపీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి దంపతులు తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. ఇకపోతే ఈనెల 28న కేంద్ర మాజీమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కుటుంబం తెలుగుదేశం పార్టీలో చేరనుంది. ఇలా వరుసగా టీడీపీలోకి వలసలు రావడంతో ఆ పార్టీ మాంచి జోష్ లో ఉంది.