వివాదాస్పద వ్యాఖ్యలతో తరచు వార్తల్లో నిలిచే టీడీపీ నేత, అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన భేష్ అంటూ ప్రశంసల జల్లు కురిపించారు.

స్థానిక ఎన్నికల్లో పోటీ చేయబోమని.. పౌరుషానికి పోటీ చేసినా అనర్హత వేటు, జైలు పాలవ్వక తప్పదని జేసీ వెల్లడించారు. కొత్త చట్టం తీసుకురావడమంటే అన్ని స్థానాలు ఏకగ్రీవం కోసమేనని ఆయన అభిప్రాయపడ్డారు.

Also Read:జగన్ సర్కార్ మరో షాక్: జేసీ దివాకర్ రెడ్డి భద్రత తొలగింపు

ప్రపంచంలో పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికలను కూడా ఏకగ్రీవం చేయడం ఇదే తొలిసారి కావొచ్చునని జేసీ తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ఎప్పటికీ మావాడేనని, జగన్ నవమాసాల పాలన భేష్ అన్నారు.

కాగా కొద్దిరోజుల క్రితం జేసీ దివాకర్ రెడ్డి భద్రతను జగన్ ప్రభుత్వం తొలగించింది. గతంలోని గన్‌మెన్‌లను 2+2 నుంచి 1+1కు తగ్గించగా ఇప్పుడు ఏకంగా పూర్తి భద్రతను తొలగించడంతో జేసీ అప్పట్లో భగ్గుమన్నారు. వైసీసీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ కుటుంబంపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read:చంద్రబాబుపై కసి ఉంటే ముక్కలుగా నరికి చంపేయ్: జగన్ పై జేసీ సంచలనం

జేసీ కుటుంబానికి చెందిన దివాకర్ ట్రావెల్స్‌ బస్సులను నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నారంటూ ఆర్టీఏ అధికారులు కొరడా ఝుళిపించారు. అంతకుముందు పోలీసులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన జేసీ దివాకర్ రెడ్డిపై అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైన సంగతి తెలిసిందే.