అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రశంసలు కురిపించారు మాజీఎంపీ, పద్మభూషణ్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్. సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను కలిశారు యార్లగడ్డ. 

తెలుగు భాష పరిరక్షణ కోసం జగన్ తో చర్చించారు. రాష్ట్ర రాజధాని అమరావతి శిలాఫలకంపై ఇంగ్లీషు అక్షరాలను తొలగించాలని సూచించారు. అమరావతి రాజధాని శిలాఫలకంపై ఇంగ్లీషు అక్షరాలను తొలగించి తెలుగులో ఏర్పాటు చేస్తామని జగన్ హామీ ఇచ్చినట్లు తెలిపారు. 

తెలుగుభాష పట్ల సీఎం జగన్ స్పందన చాలా బాగుందన్నారు. తెలుగుభాష పరిరక్షణ కోసం చర్యలు తీసుకోవాలంటూ కోరినట్లు తెలిపారు. రాష్ట్రంలో తెలుగుభాషను పాలనా భాషగా అమలు చేయాలని కోరినట్లు స్పష్టం చేశారు. ఇంటర్ వరకు తెలుగు తప్పనిసరిగా అమలు చేయాలని కోరినట్లు తెలిపారు. 

మరోవైపు మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తీవ్ర విమర్శలు చేశారు. తెలుగు భాషను నిర్వీర్యం చేశారంటూ ఆరోపించారు. అమరావతి శిలాఫలకంపై కూడా ఇంగ్లీష్ అక్షరాలు ఉండటం సిగ్గుచేటు అన్నారు. ఇదే విషయాన్ని గతంలో చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని జగన్ పట్టించుకున్నందుకు సంతోషకరమన్నారు మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్.