చంద్రబాబు అరెస్ట్ కక్ష సాధింపే.. టీడీపీ వాళ్లు నన్ను ట్రోల్ చేస్తున్నారు , పవన్ వెయిట్ చేయాల్సింది : ఉండవల్లి
చంద్రబాబు అరెస్ట్ కక్ష సాధింపేనని.. ఆయన ఆరోగ్యం బాగోకపోతే ఖచ్చితంగా ఆసుపత్రిలో చేర్చాలన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ . ఈ స్కాంలో చంద్రబాబుకు డబ్బులు ముట్టినట్లు ఆధారాలు లేవని, కానీ ఆయన పీఏ ఖాతాకు డబ్బులు వెళ్లాయనేది నిజమన్నారు.

స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం దర్యాప్తును సీబీఐ విచారణకు అప్పగించాలని కోరడంపై వివరణ ఇచ్చారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు తాను వ్యతిరేకం అన్నట్లుగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోందన్నారు. స్కిల్ కేసుకు సంబంధించిన ఫైలు మాయం కావడంపై అనుమానాలు వున్నాయని అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఈ కేసులో వున్నవి సూట్ కేసు కంపెనీలని.. అసలు ఆ ఫైల్స్ టీడీపీ హయాంలో మాయమయ్యాయా లేక వైసీపీ వచ్చాక జరిగిందా అన్నది తేలాలన్నారు. అవినీతి చేయకుండా ఏ నాయకుడు ఓటర్లకు డబ్బులు పంచలేదన్నారు.
చంద్రబాబు అరెస్ట్ కక్ష సాధింపేనని.. ఆయన ఆరోగ్యం బాగోకపోతే ఖచ్చితంగా ఆసుపత్రిలో చేర్చాలన్నారు. చంద్రబాబు వయసు, హోదా రీత్యా గెస్ట్‌హౌస్‌లో కానీ.. ఇంట్లో గానీ నిర్బంధంచవచ్చని ఉండవల్లి తెలిపారు. బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌కు సైతం ఇదే సౌకర్యం కల్పించారని.. సీబీఐ విచారణ జగన్, చంద్రబాబు ఇద్దరికి మంచిదేనని అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఈ స్కాంలో చంద్రబాబుకు డబ్బులు ముట్టినట్లు ఆధారాలు లేవని, కానీ ఆయన పీఏ ఖాతాకు డబ్బులు వెళ్లాయనేది నిజమన్నారు.
Also Read: ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసు విచారణ సీబీఐకి: ఉండవల్లి పిటిషన్ పై విచారణ నాలుగు వారాలకు వాయిదా
రాజమండ్రి సెంట్రల్ జైలులో చాలా బాగుంటుందని, జైలుకు వెళ్లొచ్చిన టీడీపీ నేతలే ఈ విషయం చెప్పారని ఉండవల్లి అరుణ్ కుమార్ పేర్కొన్నారు. మరోవైపు.. టీడీపీ , జనసేన పొత్తుపైనా ఉండవల్లి కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ తొందరపడ్డారని.. కొద్దిరోజులు ఆగాల్సిందని అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. పవన్ కలవడం వల్ల టీడీపీ బలం పెరిగిందని ఉండవల్లి పేర్కొన్నారు.