ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ . సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పెట్టిన కొత్త పార్టీపైనా ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు. 

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయాల్లో త్యాగాలు చేయడానికి ఎవరూ రారని తెలిపారు. సీటు లేదని చెప్పాలంటే దానికి చాలా అనుభవం వుండాలని, అలాంటి అనుభవం సీఎంకు వుందని తాను అనుకోవడం లేదని అరుణ్ కుమార్ పేర్కొన్నారు. అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యేల టికెట్లు మార్చే ప్రక్రియ సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. 

ఏపీలో ఎమ్మెల్యేలకు ఎక్కడా అధికారం లేదని అధికారం అంతా జగన్ , వాలంటీర్ల చేతిలో మాత్రమే వుందని ఉండవల్లి అరుణ్ కుమార్ పేర్కొన్నారు. అప్పులు చేసి సంక్షేమం పథకాల పేరుతో డబ్బులు పంచడం ఎక్కడా చూడలేదంటూ ఆయన సెటైర్లు వేశారు. నెహ్రూ అంటే వైఎస్సార్‌కు ఎంతో ఇష్టమని, అలాంటిది పండిట్ నెహ్రూను విజయసాయిరెడ్డి పార్లమెంట్‌లో తప్పుపట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మరోవైపు.. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పెట్టిన కొత్త పార్టీపైనా ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు. జేడీ పార్టీ పెట్టడం ద్వారా సీట్లు సంపాదించకపోయినా ఓట్లు శాతం సంపాదిస్తుందని పేర్కొన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ల కలయిక వారికి బలమేనని.. ఏపీలో కాంగ్రెస్ పుంజుకుంటుందని ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. రాజమండ్రిలో విచ్చలవిడిగా భారీ వృక్షాలను నరికేస్తున్నారని.. వెంటనే దానిని ఆపాలని ఆయన కోరారు. 

లోక్‌సభలో 150 మంది ఎంపీలను సస్పెండ్ చేయడం సరైన పద్ధతి కాదని ఉండవల్లి అరుణ్ కుమార్ స్పష్టం చేశారు. పార్లమెంట్‌లోకి చొరబడిన దుండగుడికి ఆ పాసులు ఇచ్చిన ఎంపీని ఇప్పటిదాకా విచారించలేదని ఆయన ఎద్దేవా చేశారు. ఒకేసారి ఇంతమంది ఎంపీలను సస్పెండ్ చేయడం తానెప్పుడూ చూడలేదని చురకలంటించారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశంసలు కురిపించారు, కానీ ఏపీలో ఆ పరిస్ధితి లేదన్నారు.