జైలుకెళ్లిన ప్రతి నేతా గెలుస్తున్నాడని.. రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లి రాగానే గెలిచారని, జగన్ జైలుకు వెళ్లారు గెలిచారని .. చంద్రబాబు కూడా జైలుకు వెళ్లాడు కాబట్టి గెలుస్తాడని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు.
ఏపీ రాజకీయాలపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేకహోదాపై కేంద్రాన్ని ప్రశ్నించడానికి గతంలో చంద్రబాబు భయపడ్డారని, ఇప్పుడు జగన్ కూడా భయపడ్డారని వ్యాఖ్యానించారు. రాక్షసుడిని , దుర్మార్గుడిని అయినా భరించవచ్చు కానీ.. పిరికివాడిని భరించే పరిస్ధితి వుండకూడదన్నారు. కేసుల భయంతోనే వారిద్దరూ కేంద్రాన్ని ప్రశ్నించలేకపోయారని.. ప్రపంచంలోకెల్లా నిజాయితీపరుడిని అని చెప్పుకునే కేజ్రీవాల్ మీదా కేసు పెట్టారని అరుణ్ కుమార్ చురకలంటించారు. అందరూ ప్రభుత్వ స్కూళ్లలోనే చేరే పరిస్ధితి తెచ్చిన సిసోడియాను కూడా జైళ్లో వేశారని.. ఆయనను బయటికి రానివ్వరని పేర్కొన్నారు.
జైలుకెళ్లిన ప్రతి నేతా గెలుస్తున్నాడని.. రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లి రాగానే గెలిచారని, జగన్ జైలుకు వెళ్లారు గెలిచారని .. చంద్రబాబు కూడా జైలుకు వెళ్లాడు కాబట్టి గెలుస్తాడని జనం అంటున్నారని ఉండవల్లి అన్నారు. చట్టాన్ని అమలు చేసే విషయంలో తిరగబడకపోతే ఎలా..? పార్లమెంట్ తలుపులు మూసి రాష్ట్ర విభజన చట్టం తయారు చేశారని అరుణ్ కుమార్ గుర్తుచేశారు.
ఎన్నికల సమయంలో నోటాకు ఓట్లు పడకపోవడానికి అనేక కారణాలు వున్నాయని ఉండవల్లి తెలిపారు. ప్రజలు ఎవరు తక్కువ అవినీతిపరుడో చూసుకుని వారికి ఓటేస్తున్నారని .. టమాటాలన్నీ పుచ్చులే వున్నప్పుడు వాటిలో కాస్త మంచివాటిని ఏరుకున్న సూత్రమే ఇక్కడా వర్తిస్తుందని ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు.
