విజయవాడ: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానంటూ వస్తున్న వార్తలపై మాజీఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ క్లారిటీ ఇచ్చేశారు. తాను వైసీపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు కేవలం సోషల్ మీడియా సృష్టేనని చెప్పుకొచ్చారు. 

సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ప్రజలు నమ్మెుద్దన్నారు. రాజకీయాలపై తాను వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నానని ఇకపై రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదన్నారు. కంపల్సరీ రిటైర్మెంట్ తీసుకుంటే అది పనిష్మెంట్ లా భావించి రాజకీయాల్లోకి వచ్చేవాడినని కానీ తాను వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నానన్నారు. 

తనకు ఇలాగే బాగుందన్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీల తప్పులను ఎత్తిచూపుతూ ప్రజలకు అవసరమయ్యే మంచి కోసం మాట్లాడటంపై సంతృప్తి చెందుతున్నానని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తనకంటే ఎంతోమంది మేధావులు, రాజకీయ అనుభవజ్ఞులు ఉన్నారని చెప్పుకొచ్చారు. తన అవసరం ఆ పార్టీకి ఉండదన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్.