గుంటూరు: మాజీమంత్రి, దివంగత టీడీపీ నేత పరిటాల రవిని ఎవరు హత్య చేశారో అందరికీ తెలుసునంటూ కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు. నరసరావుపేటలో టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ దివంగత కోడెల శివప్రసాదరావు సంతాప సభలో పాల్గొన్న ఆయన పరిటాల రవిని చంపిన వారు ఎక్కడ ఉన్నారో అందరికీ తెలుసునన్నారు. 

వారికి పట్టిన గతే కోడెల శివప్రసాదరావు మృతికి కారణమైన వారికీ అదే గతి పడుతుందని యరపతినేని శాపనార్థాలు పెట్టారు. వైసీపీ కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమపై తప్పుడు కేసులు పెట్టి మానసికంగా వేధింపులకు గురి చేస్తోందని ఆరోపించారు. 

అధికారంతో వైసీపీ నేతలకు కళ్లు నెత్తికెక్కాయని యరపతినేని విమర్శించారు. ప్రజలు అంతా గమనిస్తున్నారని తగిన సమయంలో సరైన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. వైసీపీ నేతలకు ప్రజలే గుణపాఠం చెప్తారని యరపతినేని హెచ్చరించారు.