కడప: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు వాడిగా వేడిగా సాగుతున్నాయి. తాజాగా కడప జిల్లాలో ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. కామనూరు అభ్యర్థి డబ్బులు పంచుతున్నారని వరదరాజులు రెడ్డి వర్గీయులు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. 

అయితే, వరదరాజులు రెడ్డి తమను బెదిరిస్తున్నారని అభ్యర్థి వర్గీయులు ఫిర్యాదు చేశారు. దీంతో వరదరాజులు రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి త్రీ టౌన్ స్టేషన్ కు తరలించారు. అరెస్టుకు నిరసనగా వరదరాజులు రెడ్డి వర్గీయులు పోలీసు స్టేషన్ కు చేరుకున్నారు.  అరెస్టుకు నిరసనగా వారు పోలీసు స్టేషన్ ఎదుట బైఠాయించారు.

ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) ఈ రోజు, సోమవారం సాయంత్రం 5 గంటలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలువనున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇష్యూపైన, తనపై ప్రివిలేజెస్ కమిటీ సీరియస్ కావడంపైన ఆయన గవర్నర్ తో మాట్లాడే అవకాశం ఉంది. 

పెద్దిరెడ్డి రమాచంద్రా రెడ్డి ఎన్నికల అధికారులను బెదిరించారనే ఆరోపణపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ సీరియస్ గా స్పందించిన విషయం తెలిసిందే. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఆంక్షలు విధిస్తూ ఆయన ఆదేశాలు జారీ చేశారు. దానిపై ప్రివిలేజెస్ కమిటీ చైర్మన్ కాకాణి గోవర్ధన్ తీవ్రంగా స్పందించారు. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,  బొత్స సత్యనారాయణ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద ఇచ్చిన సభా హక్కుల ఉల్లంఘన నోటీసుపై ప్రివిలెజేస్ కమిటీ దృష్టి పెట్టింది.

కాగా, రేపు మంగళవారం తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలోని 12 జిల్లాల్లో 3,249 గ్రామాల్లో రేపు పోలింగు జరుగుతుంది. దీంతో పోలింగ్ కేంద్రాలకు సామగ్రిని తరలిస్తున్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది కోసం శానిటైజర్లు, మాస్కులు కూడా పంపిస్తున్నారు. ఇప్పటికే నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాష్ట్రంలో పర్యటించారు.