అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీమంత్రి, ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసులో పురోగతి సాధించింది సిట్ బృందం. ఇటీవలే వైయస్ జగన్ ప్రభుత్వం మాజీమంత్రి వైయస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి పాత సిట్ స్థానంలో కొత్త బృందాన్ని నియమించింది. 

కేసు విచారణను ఛాలెంజ్ గా తీసుకున్న సిట్ బృందం కడపలోని వైయస్ వివేకానందరెడ్డి ఇంటిని పరిశీలించింది. హత్య జరిగిన ప్రాంతాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసింది. వాచ్ మన్ రంగయ్యను విచారించింది. 

ఈ నేపథ్యంలో రంగయ్య సమాధానంపై అనుమానాలు రావడంతో అతడికి నార్కో ఎనాలసిస్, లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించేందుకు హై కోర్టు అనుమతి కోరారు. దీంతో బుధవారం సాయంత్రం హైకోర్టు నార్కోఎనాలసిస్, లై డిటెక్టర్ పరీక్షలకు అనుమతినిచ్చింది. 

హైకోర్టు అనుమతితో వాచ్ మన్ రంగయ్యను హైదరాబాద్ కు తీసుకెళ్తున్నారు సిట్ బృందంలోని పోలీసులు. గురువారం నార్కోఎనాలసిస్, లై డిటెక్టర్ పరీక్షలు చేయించనున్నారు. ఇకపోతే మార్చి 15న వైయస్ వివేకానందరెడ్డి అత్యంత దారుణ హత్యకు గురయ్యారు. వివేకానందరెడ్డి హత్యకేసుకు సంబంధించి ఇప్పటికే ముగ్గురు అనుమానితులు రిమాండ్ లో ఉన్నారు.