పీపీఏల విషయంలో సీఎం జగన్ తన వైఖరిని మార్చుకోకుంటే... ఏపీలో రాష్ట్రపతి పాలన తప్పదని టీడీపీ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు హెచ్చరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పీపీఏలపై సమీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. శాసనసభ సమాశాల్లో సైతం దీనిపై చర్చలు జరుగుతున్నాయి. కాగా.. ఈ విషయంపై మాజీ మంత్రి యనమల స్పందించారు.

జగన్ తన వైఖరిని మార్చుకోవాలని సూచించారు. లేదంటే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉందన్నారు. కేంద్రం ఆదేశాలను బేఖాతరు చేస్తే ఆర్టికల్-257 ప్రకారం రాష్ట్రపతి పాలన విధించే అధికారం కేంద్రానికి ఉందని ఆయన గుర్తు చేశారు. కాబట్టి కేంద్రం ఎందుకు ఆ సూచన చేసిందో అర్థం చేసుకోవాలని హితవు పలికారు. పీపీఏ వ్యవహారంతో దేశ ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయని చెప్పారు.

అయితే... ముఖ్యమంత్రి జగన్ మాత్రం వీరి మాటలను ఖాతరు చేయకపోవడం గమనార్హం. గత ప్రభుత్వ హయాంలో ఎక్కువ ధరలకు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు జరిగాయని జగన్ ఆరోపిస్తున్నారు. విద్యుత్ కొనుగోళ్లు భారమైనప్పుడు కేంద్రం కూడా గతంలో పీపీఏలను సవరించుకుందని ఆయన చెబుతున్నారు. కానీ... ప్రతిపక్ష టీడీపీ, కేంద్రంలోని అధికార బీజేపీ వాదనలు మాత్రం వేరే విధంగా ఉన్నాయి.