అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మాజీమంత్రి టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. నవరత్నాలు అమలు చేయలేకే వైసీపీ ప్రభుత్వం గగ్గోలు పెడుతుందని ఆరోపించారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత ఆర్థిక పరిస్థితిపై ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విడుదల చేసిన శ్వేతపత్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్వేతపత్రం తప్పుల తడక అంటూ మండిపడ్డారు. కార్పొరేషన్ అప్పుల్ని రాష్ట్ర అప్పులుగా చూపించారని మండిపడ్డారు. 

కేంద్రం కూడా రూ.7లక్షల కోట్లు అప్పులు చేసింది దాన్ని కూడా అప్పల ఖాతాలో చూపిస్తారా అంటూ నిప్పులు చెరిగారు. పాలన చేతకాక తెలుగుదేశంపై బురదజల్లి తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. 

విభజన సమయంలో రాష్ట్రంలో రెవెన్యూ కంటే అప్పులు ఎక్కువ వచ్చాయని యనమల ఆరోపించారు. తెలుగుదేశం ప్రభుత్వం తలసరి ఆదాయాన్ని భారీగా పెంచినట్లు తెలిపారు. అన్ని అంశాల్లో తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రాన్ని వృద్ధి పరిచిందన్నారు. వ్యవసాయ రంగంలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందన్నారు. 

అగ్రికల్చర్ 7శాతంతో అగ్రస్థానంలో ఉందని యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. పాలన చేతకాక తప్పు అంతా తమ ప్రభుత్వంపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. శ్వేతపత్రం పరిశీలిస్తే మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అవగాహన రాహిత్యం కనబడుతోందన్నారు. 

అధికారులు తప్పుడు సమాచారం ఇచ్చారా లేక బుగ్గన అవగాహన లేక మాట్లాడుతున్నారో తెలీదు కానీ శ్వేతపత్రం అంతా తప్పులు తడక అని యనమల రామకృష్ణుడు విమర్శించారు.