అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టిన బడ్జెట్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు మాజీ ఆర్థిక శాఖమంత్రి యనమల రామకృష్ణుడు. ఏపీ బడ్జెట్ ప్రచారం ఎక్కువ, పస తక్కువ అంటూ వ్యాఖ్యానించారు. 

అప్పులు గురించి నీతులు చెప్పిన వైసీపీ ఇప్పుడు అప్పులు చేయడం లేదా అని ప్రశ్నించారు. అప్పులు గురించి వైసీపీ అడుక్కోవడం లేదా అని నిలదీశారు. సున్నా వడ్డీపై అసెంబ్లీలో నానా హంగామా చేసి కేవలం రూ.100 కోట్లు మాత్రమే కేటాయించారని విరుచుకుపడ్డారు. 

సోషల్ వెల్ఫేర్ కు నిధులు తగ్గించారని అలాగే ఇరిగేషన్ శాఖకు రూ.1000 కోట్లు నిధులు తగ్గించారని ఆరోపించారు. బడ్జెట్ లో ప్రకటించిన అన్ని పథకాలకు వైయస్ఆర్,  జగన్ పేర్లు తప్ప వేరే పేర్లు లేవా అని నిలదీశారు. 

కొన్ని పథకాలకైనా కనీసం అల్లూరి సీతారామరాజు, కందుకూరి వీరేశలింగం, డా.బి.ఆర్ అంబేద్కర్ లాంటి మహనీయుల పేర్లు పెడితే బాగుండేదని సూచించారు. బడ్జెట్ లో నవరత్నాలు గురించి ప్రస్తావించిన జగన్ ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల గురించి ప్రస్తావించకపోవడం విచారకరమన్నారు. జగన్ సర్కార్ కు దశ ఉంది కానీ దిశలేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు యనమల రామకృష్ణుడు.