కర్నూలు: వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు మాజీమంత్రి భూమా అఖిలప్రియ. వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతీ పనికి రేటు ఫిక్స్ చేశారంటూ ఆరోపించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవలే ప్రకటించిన గ్రామ వాలంటీర్ పోస్టులకు డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. 

ఆళ్లగడ్డ నియోజకవర్గంలో గ్రామవాలంటీర్ కు ఒక రేటు, సబ్ స్టేషన్లో ఉద్యోగానికి ఒక రేటు, బోరు కావాలంటే ఒకరేటు, ఇల్లు కావాలంటే ఒకరేటు, రోడ్డుకు ఇంత అని చొప్పున బోర్డు పెట్టుకున్నారని ఆమె ఆరోపించారు. ఇది ఆళ్లగడ్డ ప్రజల దౌర్భాగ్య పరిస్థితి అని భూమా అఖిలప్రియ ఆరోపించారు. 

ఈ ఆరోపణలు తాను చేస్తున్నవి కాదని కడప, నెల్లూరు జిల్లాల నుంచి వస్తున్న ప్రజలు చెప్తున్నారని చెప్పుకొచ్చారు. గ్రామ వాలంటీర్ పోస్టుల్లో ఇంటర్వ్యూలో అడిగే ప్రశ్నలు వింటుంటే నవ్వొస్తుందన్నారు. ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి చెల్లిపేరు ఏంటి, జగన్మోహన్ రెడ్డి తల్లిపేరు ఏంటి, జగన్ ఇంటి అడ్రస్ ఏంటని అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. 

గ్రామవాలంటీర్లు ఎంపిక అనేది చాలా అన్యాయంగా జరుగుతుందన్నారు. వైసీపీ నాయకులు లిస్ట్ ఇస్తే వారినే ఎంపిక చేస్తున్నారని తెలిపారు. ఇంటర్వ్యూలో మీ ఎమ్మెల్యే పేరు అని అడిగితే తన పేరు చెప్తున్నారని ఆమె చెప్పుకొచ్చారు. 

చదువుకు తగ్గట్లు ఉద్యోగాలు ఇవ్వడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని మాజీమంత్రి భూమా అఖిలప్రియ ఆరోపించారు. డిగ్రీలు చదువుకున్న వారికి ఒక బండి ఇచ్చి దానిలో సరుకులు ఇచ్చి ఇంటింటికి పోయి అమ్మాలంట అంటూ సెటైర్లు వేశారు. దానికా మీరు డిగ్రీలు చేసింది అంటూ నిలదీశారు. 

దాన్ని ఉద్యోగాలు అనరని 50 ఇళ్లకు పనోళ్లు అంటారని విమర్శించారు. ఇలాంటి దౌర్భాగ్యపరిస్థితిలో రాష్ట్ర ప్రజలు ఉన్నారని ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమ్మఒడి పథకంపై ఇప్పటికీ ప్రభుత్వంలో క్లారిటీ లేదని విమర్శించారు. ఒక్క అమ్మఒడి పథకమే కాదని అనేక పథకాల అమలుపై ప్రభుత్వానికే క్లారిటీ లేదని విమర్శించారు. 

ఇకపోతే అసెంబ్లీ సమావేశాలు చూస్తుంటే సిగ్గేస్తుందన్నారు. అసెంబ్లీ సమావేశాలు చూస్తున్న ప్రజలు తలకొట్టుకుంటున్నారని ఇదేం ఖర్మరా బాబు అంటున్నారని విమర్శించారు. రౌడీలు, గుండాలు ఎలా కొట్టుకుంటారో అలా కొట్లాడుతున్నారని విమర్శించారు. 

వైయస్ జగన్ అధికారంలోకి వస్తే వర్షాలు కురుస్తాయని పదేపదే చెప్పుకొచ్చారని ఇప్పటికైనా మబ్బు కూడా వదిలిందా అని ప్రశ్నించారు. గతంలో రైతులు మాత్రమే ఇబ్బందులకు గురయ్యేవారని జగన్ ప్రభుత్వంలో తాగేందుకు కూడా నీరు లేదని విమర్శించారు. 

జగన్ వస్తే వర్షాల మాట దేవుడెరుగు అని ఉన్న నీరు ఆవిరైపోతుందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అధికారులపై బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అన్ని వర్గాల ప్రజలు వైసీపీ ప్రభుత్వంలో అన్యాయానికి గురవుతున్నారని తెలిపారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేయాలని కోరారు.