రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఎవరికీ అర్ధం కాని పరిస్థితి నెలకొందన్నారు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఆదివారం తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన పరిపాలన ప్రజలకు అందుబాటులో లేకుండాపోయిందని ఆరోపించారు.

వ్యవస్థలన్నీ కుప్పకూలిపోతున్నాయి..అది కూడా పతాకస్థాయికి చేరిందని ఎద్దేవా చేశారు. న్యాయస్థానాలు, న్యాయమూర్తులపైనే అటాక్ చేయడం దేశంలోనే కాదు..ప్రపంచంలోనే ఎక్కడా చూడలేదని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు.

రాజ్యాంగాన్నే విచ్చిన్నం చేసే పరిస్థితికి రావడం దురదృష్టకరమన్నారు. మీకు సమస్యలుంటే సుప్రీంకోర్టుకు అప్పీలు చేసుకోవచ్చని న్యాయమూర్తులే చెప్పారని చంద్రమోహన్ రెడ్డి గుర్తుచేశారు.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసుకోవచ్చని కానీ దానిని బహిరంగ పరిచి ఓపెన్ డిబేట్లు పెట్టి జడ్జిలు, వారి కుటుంబాలను విమర్శించే రాజకీయ పార్టీని, ప్రభుత్వాన్ని ఇప్పుడే చూస్తున్నామన్నారు.

ఇది మంచి సంప్రదాయం కాదని... ఎవరికీ శ్రేయస్కరం కాదన్నారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందో..సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటుందో చూడాలి..దీనికి మాత్రం ఎక్కడో ఒక దగ్గర పుల్ స్టాప్ పడాలని సోమిరెడ్డి ఆకాంక్షించారు.