ఓదార్పుకు కాదు, డీల్ మాట్లాడేందుకు జైలుకి .. పవన్ 25 సీట్లలో కూడా పోటీ చేయడు.. అవి బాబుకే : పేర్నినాని
పవన్ కల్యాణ్ 25 సీట్లు కూడా పోటీ చేయడని.. ఆ 25 స్థానాలకు కూడా చంద్రబాబు అభ్యర్ధులను సప్లై చేస్తాడని వ్యాఖ్యానించారు మాజీ మంత్రి పేర్ని నాని . కలవడం, విడిపోవడం కేవలం ముసుగు మాత్రమేనని ఆయన ధ్వజమెత్తారు.

చంద్రబాబు అవినీతి చేసి దొరికాడని మండిపడ్డారు వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నోవాటెల్‌కు వచ్చాడని మొన్న బాబును పవన్ కల్యాణ్ పరామర్శించాడని దుయ్యబట్టారు. మరి ఇవాళ పవన్ ఎందుకు వెళ్లాడని పేర్ని నాని ప్రశ్నించారు. చంద్రబాబును ఓదార్చడానికి పవన్ వెళ్లాడనుకున్నామని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబును ఓదార్చడానికి వెళ్లాడా.. లేక చంద్రబాబుతో బేరం మాట్లాడటానికి వెళ్లాడా అని పేర్నినాని ప్రశ్నించారు.
చంద్రబాబుతో ములాఖత్ కాదు మిలాఖత్ అని తేలిందని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీతో పవన్‌ది తాత్కాలిక పొత్తు మాత్రమేనని .. తెలుగుదేశంతోనే పవన్‌కు శాశ్వత పొత్తు అని పేర్ని నాని స్పష్టం చేశారు. సెంటిమెంట్ ప్రకారం పాత ఫ్రెండ్‌ను ఓదార్చేందుకు జైలుకు వెళ్లాడనుకున్నామన్నారు. కానీ జైలు నుంచి బయటకు వచ్చాక సెంటిమెంట్ కాదు, సెటిల్‌మెంట్ అని అర్ధమైందని పేర్ని నాని దుయ్యబట్టారు. ఒకసారి బీజేపీ, టీడీపీతో పొత్తన్నాడని.. ఆ తర్వాత కమ్యూనిస్టులతో జత కలిశాడని నాని దుయ్యబట్టారు.
మళ్లీ మనసు మార్చుకుని బీజేపీ చెంతకు చేరాడని.. ఇప్పుడేమో 2024లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని చెబుతున్నాని ఆయన చురకలంటించారు. ఇందులో కొత్తముంది.. పాత కథేనని, పవన్ కల్యాణ్ టీడీపీలో అంతర్భాగమని అందరికీ తెలుసునని పేర్నినాని ఆరోపించారు. కలవడం, విడిపోవడం కేవలం ముసుగు మాత్రమేనని ఆయన ధ్వజమెత్తారు. పవన్‌కు క్లారిటీ వుందని.. బీజేపీకే లేదని నాని వ్యాఖ్యానించారు. బీజేజీ ఎప్పటికప్పుడు పిల్లి మొగ్గలు వేస్తోందని.. పవన్ పొత్తు పాత వార్తేనని, ఇందులో కొత్తదనం లేదని పేర్ని నాని దుయ్యబట్టారు.
ALso Read: బీజేపీని తీసుకొచ్చే బాధ్యతను పవన్‌కు చంద్రబాబు అప్పగించారేమో: సజ్జల
చంద్రబాబుతో పవన్ వ్యాపారం మాట్లాడుకుని వచ్చాడా అని ఆయన ప్రశ్నించారు. తన కార్యకర్తలకైనా పవన్ ఈ విషయం చెప్పాలని నాని చురకలంటించారు. పవన్ పరామర్శకు జైలుకెళ్లి డీల్ చేసుకుని వచ్చారని పేర్ని నాని ఆరోపించారు. ప్రజాధనం దోచుకున్న దొంగను పవన్ పరామర్శిస్తాడా అని ఆయన ప్రశ్నించారు. ఇదేనా పవన్ చెప్పిన జనసేన సిద్ధాంతమని నాని నిలదీశారు. అవినీతిపై పవన్ రాజీలేని పోరాటం చేస్తానని చెప్పారని ఆయన గుర్తుచేశారు. మరి అవినీతిపరుడైన చంద్రబాబుకు ఎలా మద్ధతు ప్రకటిస్తాడని పేర్ని నాని ప్రశ్నించారు.
తాను దోచుకున్న డబ్బులో లోకేష్ వాటా ఇస్తానని చెప్పాడా అని నిలదీశారు. లోకేష్‌తో సీట్లేనా లేక లెక్కలు కూడా పంచుకున్నారా అని నాని ప్రశ్నించారు. తనను నమ్ముకున్నవారిని మోసం చేసి పవన్ లాభపడుతున్నాడని ఆయన ఆరోపించారు. సినిమాల్లోనే పవన్ హీరో అని.. బయట మాత్రం జోకర్ అంటూ నాని సెటైర్లు వేశారు. చంద్రబాబు వాడుకుని వదిలేస్తానని పవన్ చెప్పలేదా అని ఆయన ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ 25 సీట్లు కూడా పోటీ చేయడని.. ఆ 25 స్థానాలకు కూడా చంద్రబాబు అభ్యర్ధులను సప్లై చేస్తాడని నాని ఆరోపించారు.