పవన్ క్యారెక్టర్ తెలిసిందా .. ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటారు : టీడీపీ జనసేన తొలి జాబితాపై పేర్ని నాని స్పందన
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ జనసేన కూటమి తొలి జాబితాను శనివారం ప్రకటించింది. పవన్ ఎలాంటివాడో కాపులకు ఇవాళ అర్ధమైందని.. ఇన్నాళ్లు తమను విమర్శించినవాళ్లు ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటారని ఆయన ఘాటు విమర్శలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ జనసేన కూటమి తొలి జాబితాను శనివారం ప్రకటించింది. అయితే జనసేన పార్టీ పొత్తులో భాగంగా 24 అసెంబ్లీ, 3 లోక్‌సభ స్థానాలకు పరిమితం కావడం పట్ల అధికార వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. చంద్రబాబు తన సామాజిక వర్గానికి 21 సీట్లు ప్రకటించుకున్నారని, కాపులకు మరీ హీనంగా 7 సీట్లు ప్రకటించారని మండిపడ్డారు.
చంద్రబాబు శ్రేయస్సు కోసమే రాజకీయాలు చేసే పవన్ .. 24 సీట్లతో కాపులకు రాజ్యాధికారం అందిస్తాడా అని నాని ప్రశ్నించారు. పవన్ ఎలాంటివాడో కాపులకు ఇవాళ అర్ధమైందని.. ఇన్నాళ్లు తమను విమర్శించినవాళ్లు ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటారని ఆయన ఘాటు విమర్శలు చేశారు. పవన్ ఎక్కడ పోటీ చేయాలో చంద్రబాబే నిర్ణయిస్తారని పేర్ని నాని ఎద్దేవా చేశారు.
జనసేన, టీడీపీ కార్యకర్తలు త్యాగం చేయాలి కానీ.. చంద్రబాబు , పవన్ కుటుంబాలు మాత్రం సీట్లు పంచేసుకున్నారని చురకలంటించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, కాపులకు ప్రాధాన్యం ఇచ్చేది జగనే అని.. భువనేశ్వరి భయంతో చంద్రబాబు తన సీటును కూడా ప్రకటించుకున్నాడని దుయ్యబట్టారు. కుప్పం సీటు భువనేశ్వరి లాక్కుంటారేమోనని భయపడ్డారని పేర్ని నాని సెటైర్లు వేశారు.