సారాంశం

మాజీ మంత్రి పేర్ని నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాల్లో నుంచి రిటైర్ అవుతున్నానని సంకేతాలు ఇచ్చారు. సీఎం జగన్‌తో కలిసి తనకు మరో మీటింగ్ ఉంటుందో లేదో అని అన్నారు.

మచిలీపట్నం: మాజీ మంత్రి పేర్ని నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాల్లో నుంచి రిటైర్ అవుతున్నానని సంకేతాలు ఇచ్చారు. సీఎం జగన్‌తో కలిసి తనకు మరో మీటింగ్ ఉంటుందో లేదో అని అన్నారు. జగన్‌తో ఇదే తన చివరి మీటింగ్ కావచ్చని అన్నారు. అందుకే ఆయన తన బాధను భరించాల్సిదేనని చెప్పారు. ఈ క్రమంలోనే అక్కడి వారు ఏదో అనడంతో.. రిటైర్ అవుతున్నానని కామెంట్ చేశారు. 

తాను పుట్టిన గడ్డకు ఇంత వైభవం తీసుకొచ్చిన జగన్‌కు తప్పకుండా పాదాభివందనం చేయాల్సిందేనని.. కానీ తనకంటే వయసులో చిన్నవాడు కావడం వల్ల ఆయనకు చేతులు ఎత్తి మొక్కుతున్నానని చెప్పారు. సీఎం జగన్ ఈరోజు బందరు పోర్టు నిర్మాణపనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. 

ఈ వేదికపై నుంచి స్థానిక ఎమ్మెల్యే పేర్ని నాని మాట్లాడుతూ.. బందర్‌ అభివృద్దికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారని అన్నారు. పాదయాత్రలో చెప్పిన ప్రతి ఒక్క హామీని సీఎం జగన్ నెరవేర్చారని చెప్పారు. బందరుకు సీఎం జగన్ ఎంతో మేలు చేశారని అన్నారు. బందరులో కాలనీలు  కాదు.. ఊళ్లే నిర్మిస్తున్నారని చెప్పారు. బందరులో 25 వేలకు పైగా ఇళ్ల పట్టాలు ఇచ్చామని తెలిపారు. 14 ఏళ్లు సీఎంగా  చేసిన చంద్రబాబు పేదలకు ఒక్క సెంటు భూమి ఇచ్చారా? అని ప్రశ్నించారు. అ బందరుకు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిన ఘనత సీఎం జగన్‌దేనని అన్నారు. 64  ఎకరాల్లో రూ. 550 కోట్లతో మెడికల్ కాలేజ్ నిర్మిస్తున్నారని  చెప్పారు. బందరు వాళ్లు చచ్చేంతా వరకు సీఎం జగన్‌కు గుండెల్లో పెట్టుకోవాలని కోరారు. 

తాను దివంగత  సీఎం రాజశేఖరరెడ్డితో పనిచేశానని.. ఆయనను మరిపించేలా జగన్ పనిచేస్తున్నారని చెప్పారు. రాజశేఖర్‌రెడ్డి, జగన్‌తో కలిసి పనిచేయడం తన అదృష్టమని తెలిపారు.