అమరావతి: ట్విట్టర్ వేదికగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై నిప్పులు చెరుగుతున్నారు మాజీమంత్రి నారా లోకేష్. సీఎం జగన్ నే కాదు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ గా విరుచుకుపడుతున్నారు. 

వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏదైనా ప్రాజెక్టులో అవినీతి ఆరోపణలు వచ్చినా, ఆలస్యం అవుతన్నా రివర్స్ టెండరింగ్ నిర్వహిస్తామని పదేపదే హెచ్చరిస్తున్నారు. రివర్స్ టెండరింగ్ అంశంపై నారా లోకేష్ సెటైర్లు వేశారు.  

రివర్స్ టెండరింగ్ అంటే వైసీపీ ఎమ్మెల్యేలు.. కంపెనీలకు టెండర్ పెట్టడం అని ఆలస్యంగా అర్థం అయ్యింది జగన్ అంటూ ట్విట్టర్ వేదికగా విమర్శించారు. కంపెనీలు ఉండాలి అంటే మాకు కప్పం కట్టాల్సిందే అంటూ మీ నాయకులు నిన్న కర్నూలులోని అల్ట్రా మెగా సోలార్ పార్కులోకి చొరబడి తుపాకీతో బెదిరించారని లోకేష్ ఆరోపించారు. 

ఇటీవలే వైసీపీ ఎమ్మెల్యే మనుషులు కడప జిల్లా మైలవరం మండలంలో ఓ సోలార్ పార్క్ లోని సోలార్ ప్యానల్స్ ధ్వంసం చేసారని ఆరోపించారు. వైసీపీ ఎమ్మెల్యేలు పగలకొడుతుంది సోలార్ ప్యానల్స్ కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యువత భవిష్యత్తు అని అభిప్రాయపడ్డారు. 

మీ వాళ్ల దౌర్జన్యకాండ ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో ఉన్న కంపెనీలు పోయి మీ సైన్యం పగలగొట్టిన సోలార్ ప్యానల్స్, మీ నాయకులు వాడుతున్న తుపాకులు మాత్రమే మిగులుతాయని లోకేష్ ఘాటుగా వ్యాఖ్యానించారు.