ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి లోకేష్ విమర్శలు చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని లోకేష్ అభిప్రాయపడ్డారు. అసెంబ్లీలోలేని తనపై అధికారపార్టీ నేతలు విమర్శలు చేస్తున్నా స్పీకర్ ఏమాత్రం స్పందించడం లేదని  లోకేష్ అన్నారు. 

ఆ వ్యాఖ్యలను రికార్డులనుంచి తొలగించాలన్నారు. ‘రాజశేఖర్ రెడ్డిగారినే చూశాం.. జగన్మోహన్ రెడ్డిగారు మాకొకలెక్కా’ అని అన్నారు. రాజకీయాల్లో గెలుపు, ఓటమిలు సహజమేనని.. ఇందులో బాధపడడానికి ఏమీ లేదన్నారు.

AlsoRead మాజీ మంత్రి నారా లోకేష్ కి తృటిలో తప్పిన ప్రమాదం...
 
40 శాతం ఓట్లు వచ్చిన పార్టీ ఎక్కడికెళుతుందని లోకేష్ ప్రశ్నించారు. ఇప్పుడు ఇంకా కష్టపడతామని, ప్రజల్లోకి వెళతామని అన్నారు. జగన్ వద్ద భజన్ (పేటీఎం) బ్యాచ్ ఉందని, లైక్ కొడితే మూడు రూపాయలు ఇస్తారని, ఆ బ్యాచే ప్రచారం బాగా చేస్తుందని లోకేష్ ఎద్దేవా చేశారు. వంశీ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏమీ లేదని, ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశామని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా లోకేష్ చెప్పారు.

తమ పాలనలో అభివృద్ధి వైసీపీకి కనిపించడం లేదని ఆయన అన్నారు. తాము హెరిటేజ్ ఫ్రెష్ ను ఎప్పుడో అమ్మేశామని ఆయన స్పష్టం చేశారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి ఎన్నో కంపెనీల్లో వాటాలున్నాయని, ఆ కంపెనీలు రేట్లు పెంచితే బుగ్గన బాధ్యత వహిస్తారా అని నారా లోకేష్ అన్నారు.  

2012 నుంచి తనపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని ఆయన అన్నారు. జగన్ ఆరు నెలల పాలనలో ఉల్లి, ఇసుక, మద్యం, తదితర రేట్లు పెంచారని, వాటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు తనపై వ్యక్తిగత దూషణకు దిగుతున్నారని అన్నారు. 

తమ అమ్మ తనను క్రమశిక్షణతో పెంచిందని, జగన్ లా వీధి రౌడీలా పెంచలేదని ఆయన వ్యాఖ్యానించారు. తాను పుట్టేనాటికే తన తాత ముఖ్యమంత్రి అని, తాను స్కూల్లో చదవే సమయానికి తన తండ్రి ముఖ్యమంత్రి అని, తనను తన అమ్మ క్రమశిక్షణతో పెంచిందని ఆయన చెప్పారు. తాను చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే రకం కాదని ఆయన అన్నారు.

మంగళగిరి పులివెందుల కాదని, తెలుగుదేశం పార్టీకి మంగళగిరి కంచుకోట కాదని, అక్కడ టీడీపీ జెండా పాతేందుకు తాను పోటీ చేశానని, చరిత్ర తిరగరాసేందుకు పోటీ చేశానని ఆయన చెప్పారు. ఆరు నెలలు గడిచినా అమరావతిలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగినట్లు నిరూపించలేకపోయారని ఆయన అన్నారు..