అమరావతి: ఆపరేషన్ గరుడ వ్యవహారంలో సినీనటుడు శివాజీకి మాజీమంత్రి మాణిక్యాలరావు కౌంటర్ ఇచ్చారు. ఆపరేషన్ గరుడ అనేది అవాస్తవమంటూ తేల్చిపారేశారు. ఆపరేషన్ గరుడ వాస్తవమైతే శివాజీపై చర్యలు తప్పవంటూ చురకలు వేశారు.

రాష్ట్ర రాజకీయాలను ఓ కుదుపు కుదిపేసిన ఆపరేషన్ గరుడ వ్యవహారం మళ్లీ స్టార్ట్ అయ్యింది. సినీనటుడు శివాజీ ఆపరేషన్ గరుడ అంటూ 4నెలల క్రితం తెలుగు రాష్ట్రాల్లో నానా హంగామా చేశారు. ఆపరేషన్ గరుడు వాస్తవమా...అవాస్తవమా అని తేల్చుకునేలోపే ప్రజలు దాన్ని మరచిపోయారు. తెలుగు రాష్ట్రాల్లో రసవత్తర రాజకీయాలు నడుస్తుంటే నటుడు శివాజీ మళ్లీ ఆపరేషన్ గరుడ అంటూ మైక్ పట్టుకున్నారు.  

ఏపీ సీఎం చంద్రబాబుకి త్వరలోనే ఓ కేంద్ర సంస్థ నుంచి నోటీసులు వస్తాయని చెప్పారు. శివాజీ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అసలు ఎందుకు నోటీసులిస్తారు. నోటీసులివ్వాల్సిన అవసరం కేంద్రానికి ఏముంది..? అసలు శివాజీ వ్యాఖ్యల్లో వాస్తవమెంత...ఇదే తెలుగు రాష్ట్రాల్లో ఏ ఇద్దరి నేతలు కలిసినా చర్చించుకునే మాటలు.  
 
ఆపరేషన్ గరుడ పై సినీనటుడు శివాజీకి మాజీ మంత్రి మాణిక్యాల రావు  కౌంటర్ ఇచ్చారు. ఆపరేషన్‌ గరుడ అనేది అవాస్తవం. శివాజీతో టీడీపీ నేతలే ఇలా మాట్లాడిస్తున్నారంటూ ఆరోపించారు. ఆపరేషన్‌ గరుడపై విచారణ జరపాలని డీజీపీని ఏపీ బీజేపీ నేతలు కలిసినట్లు తెలిపారు. ఆపరేషన్‌ గరుడ నిజమైతే నిందితులపై చర్యలు తీసుకోవాలని ఒకవేళ అది అవాస్తవమైతే శివాజీపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు స్పష్టం చేశారు.