మాజీ సీఎం చంద్రబాబుకి పట్టిన గతే ప్రస్తుత సీఎం జగన్ కి కూడా పడుతుందని మాజీ మంత్రి మాణిక్యాలరావు జోస్యం చెప్పారు. ఏపీలో బీజేపీ బలాన్ని పెంచేందుకు పార్టీ నేతలు కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా చేపట్టిన కార్యక్రమంలో మాణిక్యాలరావు మాట్లాడారు.

జన్మభూమి కమిటీల వలనే టీడీపీ ఓడిపోయిందని, ఇప్పుడు జగన్‌ వలంటీర్ల పేరుతో అదే వ్యవస్థను తీసుకువస్తున్నారని అన్నారు. ఈ గ్రామ వాలంటీర్ల విధానమే భవిష్యత్తులో జగన్ ఓటమికి కారణం అవుతుందని హెచ్చరించారు.  కేంద్రం నిధులు ఇచ్చినా చంద్రబాబు దుష్ప్రచారం చేశారని, దేశం అంతా తిరిగినా ఆయన మాటలు ఎవరూ నమ్మలేదని చెప్పారు. 

కేంద్రం ఇచ్చిన నిధులతోనే చంద్రన్న బీమా పథకం అమలుచేశారని చెప్పారు. చంద్రబాబు విధానాలనే సీఎం జగన్‌ కూడా అనుసరిస్తున్నారన్నారు. బీజేపీ చిత్తశుద్ధితో పనిచేస్తుందనే ప్రజలు కేంద్రంలో మళ్లీ పట్టం కట్టారన్నారు. టీడీపీ మునిగిపోతున్న నావని పేర్కొన్నారు. టీడీపీ నుంచి బీజేపీకి వలసలు వస్తుండడమే అందుకు నిదర్శనమని చెప్పా రు.