మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ బుధవారం జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో భేటీ అయ్యారు. త్వరలోనే ఆయన ఆ పార్టీ తీర్ధం పుచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి బరిలోకి దిగాలని కొణతాల భావిస్తున్నారు.
వచ్చే ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ బుధవారం జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో భేటీ అయ్యారు. త్వరలోనే ఆయన ఆ పార్టీ తీర్ధం పుచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి బరిలోకి దిగాలని కొణతాల భావిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా తన వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు కొణతాల.
నిజానికి కొణతాల .. ఉత్తరాంధ్రలో ఒకప్పుడు చక్రం తిప్పారు. కాంగ్రెస్ నేతగా, మంత్రిగా ఆయన రాజకీయాలను శాసించారు. గవర సామాజిక వర్గానికి చెందిన కొణతాల.. నాలుగు దశాబ్ధాలుగా రాజకీయాల్లో వున్నారు. 1989లో తొలిసారిగా కాంగ్రెస్ తరపున అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. 2009లో ఓటమి పాలైనప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి రావడంతో కొణతాల హవా నడిచింది. అనంతరం రాష్ట్ర విభజనతో కొణతాల రామకృష్ణ కాంగ్రెస్‌ను వీడి వైసీపీలో చేరారు.
తొలినాళ్లలో రామకృష్ణకు జగన్ ప్రాధాన్యత ఇచ్చేవారు. అయితే 2014లో వైసీపీ ఓటమి పాలవ్వడం, విశాఖ ఎంపీగా విజయమ్మ ఓడిపోవడంతో కొణతాలతో పార్టీ హైకమాండ్‌కు గ్యాప్ వచ్చిందనేది టాక్. ఆ తర్వాత ఆయన పూర్తిగా సైలెంట్ అయ్యారు. అయితే గత ఎన్నికలకు ముందు రామకృష్ణ టీడీపీలో చేరతారనే ప్రచారం జరిగింది, చంద్రబాబుతో భేటీ కావడంతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరినట్లయ్యింది. రాజకీయాలకు దూరంగా వున్నప్పటికీ రైతు సమస్యలు, చెరకు సాగులో ఇబ్బందులు, షుగర్ ఫ్యాక్టరీలు మూతపడటం వంటి వాటిపై కొణతాల రామకృష్ణ పోరాడుతూ వచ్చారు.
అయితే త్వరలో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలు జరగనుండటంతో మరోసారి యాక్టీవ్ పాలిటిక్స్ వైపు కొణతాల దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన జనసేన నేతలతో టచ్‌లోకి వెళ్లినట్లుగా ప్రచారం జరిగింది. నిజానికి కొణతాల జనసేనలో చేరుతారని ఎప్పటి నుంచో ఊహాగానాలు వినిపించాయి. తాజాగా పవన్ కళ్యాణ్‌తో భేటీ తర్వాత అదే నిజమైంది.
